మళ్లీ జన్మంటూ ఉంటే మీ కూతురిగానే పుడుతా..  | BTech student ends life in Annamaiah | Sakshi
Sakshi News home page

మళ్లీ జన్మంటూ ఉంటే  మీ కూతురిగానే పుడుతా.. 

Aug 7 2025 12:45 PM | Updated on Aug 7 2025 1:31 PM

BTech student ends life in Annamaiah

సూసైడ్‌ నోట్‌ రాసి  బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య  

మదనపల్లె రూరల్‌ : ‘మీరు  నన్ను ఎంతో ప్రేమగా చూశారు.. నేను బాగా చదువుకుని మంచి జాబ్‌ చేయాలని ఎన్నో కలలు కన్నావు.. కానీ నేను చదువుకోలేకపోతున్నా డాడీ నన్ను క్షమించు’ అంటూ సుసైడ్‌ నోట్‌ రాసి తనువు చాలించింది బీటెక్‌ విద్యార్థిని రెడ్డి శ్రావణి(21). పట్టణంలోని రామారావు కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన వెంకటసుధాకర్, సుగుణ దంపతులకు అశ్వని, ప్రసన్న, శ్రావణి ముగ్గురు కుమార్తెలు.

 పెద్ద కుమార్తె అవ్వనికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రసన్న బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె పులివెందుల జేఎన్‌టీయూ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. చేనేత కారి్మకుడైన వెంకట సుధాకర్‌ భార్య సుగుణ ఐదేళ్ల క్రితం మృతి చెందగా కుమార్తెలను కష్టపడి చదివించారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట శ్రావణి వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు పులివెందుల కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. అదే రోజున తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా తాను చదువుకోలేకపోతున్నానని సుసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. 

బుధవారం ఉదయాన్నే వెంకటసుధాకర్‌ స్నానం చేసుకుని గుడికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి వెంకటసుధాకర్‌ ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి హతాశుడయ్యాడు. స్థానికుల సహాయంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకట సుధాకర్‌ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ రామచంద్ర తెలిపారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement