
బోటుకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు డిమాండ్
సాక్షి ప్రతినిధి: వరద నీరు ముంచెత్తి ప్రజలు దిక్కుతోచక ఇళ్లలోనే బందీలై సాయం కోసం హాహాకారాలు చేస్తుంటే ఒక రోజు తరువాత తీరిగ్గా బోట్లను తెప్పించింది ప్రభుత్వం. పోనీ అప్పుడైనా అన్నింటినీ రంగంలోకి దిగి బాధితులను ఒడ్డుకు చేర్చిందా అంటే అదీ లేదు. ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన పడవలను లారీల నుంచి కిందకు దించలేదు. రోడ్లమీదే ఆ లారీలను నిలిపివేశారు. దీంతో అవి వచ్చినా ఉపయోగంలేకపోయింది. కొన్ని బోట్లు అధికారులు, రాజకీయ నాయకులను తిప్పడానికే సరిపోయాయి. దీంతో ప్రైవేటు బోట్ల నిర్వాహకులు పలువురు బాధితులను దోచుకొన్నారు.
ఒడ్డుకు చేర్చడానికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకూ డిమాండ్ చేశారని బాధితులు సాక్షి బృందం వద్ద తమ గోడును చెప్పుకున్నారు. ‘ఆదివారం నుంచి వరదలోనే ఉన్నాం. అధికారులెవరూ పట్టించుకోలేదు. స్థానికంగా ఉండే కుర్రాళ్లు కొందరు నన్ను, నా మనమరాళ్లను బయటకు తీసుకువచ్చారు. మనుమడు ఇంకా వరదలోనే ఉన్నాడు. బోట్ల వారిని అడిగితే రూ.10 వేలు అడిగారు. అంత డబ్బు మా దగ్గర ఎలా ఉంటుంది? సింగ్ నగర్ వంతెనపైనే తిండి, నీరు లేకుండా కూర్చున్నాం. ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని పోలీసులు తరుముతున్నారు. ఎక్కడికిపోవాలి? ఎలా బతకాలి?’ అంటూ రాజరాజేశ్వరిపేటకు చెందిన దుర్గమ్మ కన్నీరు పెట్టుకుంది.
ఎంతగా బతిమిలాడినా పంపలేదు: 10 మంది చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నారని, బోట్లు పంపాలంటూ ఎంతగా బతిమిలాడినా పంపలేదని నందమూరి నగర్ 10వ లైన్‌కు చెందిన రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.