
వరద నీటిలో సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం కేజీబీవీ
రాష్ట్రంలో కస్తూర్బా విద్యాలయాలకు వరద కష్టాలు
చినుకు పడితే రొచ్చు.. గోడల్లోకి చెమ్మ.. దుప్పట్లు, దుస్తులు తడిసి దుర్వాసన
దోమల స్వైరవిహారం.. అయినా అక్కడే
భోజనాలు చేయాల్సిన దుస్థితి.... అనారోగ్య సమస్యలతో విలవిల్లాడుతున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కస్తూర్బా బాలికల విద్యాలయాలను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కేజీబీవీ ప్రాంగణాలు బురదమయం కావడంతో పరిసరాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. వర్షాలకు గదుల గోడల్లోకి చెమ్మ చేరింది. కప్పుకునే దుప్పట్లే కాదు... వేసుకునే దుస్తులు కూడా తడిసిపోయి వాసన వస్తున్నాయి. అపరిశుభ్రత వల్ల దోమలు వ్యాపిస్తుండటం వల్ల విద్యారి్థనులు దోమకాట్లతో అస్వస్థతకు గురవుతున్నారు. అధికారులు జోక్యం చేసుకున్నా ఇప్పటికిప్పుడు పరిస్థితి మెరుగవ్వడం కష్టంగా కనిపిస్తోంది.
పరిశుభ్రత లోపించి అనారోగ్యం..
రాష్ట్రంలో 495 కేజీబీవీ పాఠశాలలు ఉండగా 403 కేజీబీవీలను ఇంటర్ వరకూ ఉన్నతీకరించారు. కేజీబీవీల్లో 1,24,153 మంది విద్యార్థులు చదువుతున్నారు. టెన్త్ వరకూ దాదాపు లక్ష మంది విద్యార్థులు ఉన్నారు. సమగ్ర శిక్ష పర్యవేక్షణలో సాగే కేజీబీవీల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. కరీంనగర్ ప్రాంతంలోని ఓ కేజీబీవీలో విద్యార్థులు దగ్గు, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. సమీపంలోనే డంపింగ్ యార్డ్ ఉండటం, ఇటీవల వర్షాలకు ఇది దుర్గంధం వెదజల్లడం కారణమని గుర్తించారు.
కొన్ని నెలలుగా మహబూబ్‌బాద్ జిల్లాల్లో 36 మంది, నిజామాబాద్ జిల్లాల్లో 90 మంది, వనపర్తిలో 50 మంది విషాహారంతో అస్వస్థతకు గురైన ఘటనలు నమోదయ్యాయి. పరిసరాల పరిశుభ్రత లోపించడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తించారు. ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతంలోని కేజీబీవీల్లో వర్షపు నీరు చేరి ప్రాంగణమంతా బురదగా మారింది. భోజన సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దోమలు పెరిగాయి. వ్యాధుల బారిన పడుతున్నారు.
అర్వపల్లిలో అరణ్య రోదన...
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కేజీబీవీ చినుకుపడితే జలమయమవుతోంది. ఇక్కడ 300 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం సమీపంలో చేపట్టిన కాల్వ నిర్మాణం వల్ల నీరు కేజీబీవీ వద్దే నిలిచిపోతోంది. కాస్త పెద్ద వర్షం పడితే విద్యాలయానికి సెలవు ప్రకటించాల్సిందే. వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలన్న మొర వినిపించుకొనే నాథుడే లేడని స్థానికులు అంటున్నారు.
మంగపేట మూగ వేదన..
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని కేజీబీవీలో 170 మంది చదువుతున్నారు. ఇక్కడ కొత్త భవనమే ఉన్నా ప్రహరీ లేదు. పందులు, కుక్కలు సంచరిస్తున్నాయి. భోజన వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. పందుల వల్ల దోమలు పెరుగుతున్నాయి. మురుగునీరు బయటకు వెళ్లలేక దుర్వాసన వస్తోంది. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని కేజీబీవీ ఆవరణలో పిచి్చమొక్కలు పెరిగాయి. దీంతో దోమలు విపరీతంగా పెరిగాయి.
గండీడ్‌లో ఘోష
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్‌లో కొత్తగా ఏర్పాటైన కేజీబీవీ అద్దె భవనంలో నడుస్తోంది. 188 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఇటీవల వర్షాలకు నీరు నిలిచి ప్రాంగణమంతా బురదమయమైంది. దీంతో దోమలు వ్యాపించి సుమారు 40 మంది విద్యార్థులు జ్వరాల బారిన పడి ఇళ్లకు వెళ్లిపోయారు. అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.
రాజన్నా... సమస్యలేంటన్నా!
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 కేజీబీవీలన్నీ పట్టణాలకు దూరంగా ఉన్నాయి. దీంతో రక్షణ కరువైందని విద్యారి్థనులు అంటున్నారు. ఇల్లంతకుంట మండలంలోని కేజీబీవీకి వెళ్లే రోడ్డు సరిగ్గా లేక రాకపోకలకు వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం కురిస్తే ట్రాక్టర్‌పై వెళ్లాల్సి వస్తోంది. అనారోగ్య సమస్యలు వస్తే తక్షణ వైద్య సదుపాయానికి నరకయాతన పడాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు.