ముందే వచ్చిన సంక్రాంతి

BC Corporation Chairmans and BC Directors Oath taking Ceremony  - Sakshi

బీసీ పాలక మండళ్ల ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం జగన్‌

దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం.. మహిళాభ్యుదయంలో నూతన అధ్యాయం

బీసీల జీవితాలను మారుస్తానని మాట ఇచ్చా... నిలబెట్టుకున్నా

ఉద్యమంలా నిజమైన అభివృద్ధి

ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు యత్నాలు

తన భూముల ధరలు కాపాడుకునేందుకే ఆందోళన

సాక్షి, అమరావతి: బీసీ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సందడి చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల రోజులు ముందే వచ్చినట్లుగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్లకు పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహించారు. ‘బీసీల సంక్రాంతి’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు.. అగ్రవర్ణాల్లో పేదలు సామాజికంగా, ఆర్థికంగా, సదుపాయాల పరంగా నాలుగు మెట్లు పైన ఉండటమే అభివృద్ధి అని నమ్మి ఓ ఉద్యమంలా పని చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..

ఏడాదిన్నర క్రితం ఇదే చోట...
ఇదే స్థలంలో 18 నెలల ముందు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు అదే వేదిక మీద మీరందరూ ప్రమాణ స్వీకారం చేయడం నా మనసుకు ఎంతో సంతోషాన్నిస్తోంది. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైన మిమ్మల్ని చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల ముందే వచ్చిందా అన్నట్లుగా ఉంది. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే. 672 మంది డైరెక్టర్లలో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ప్రమాణ సీక్వారం చేశారని గర్వంగా చెబుతున్నా. మహిళాభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం.  

ప్రతి ఇంట్లోనూ సంతోషం..
నా 3,648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు చూశా. ఓ గ్రామంలో వెయ్యిమంది ఉంటే నాడు కనీసం ఇద్దరు ముగ్గురికి కూడా మేలు జరిగిన దాఖలాలు కనిపించ లేదు. అది కూడా టీడీపీ జెండా మోసినట్లు సర్టిఫికెట్‌ చూపిస్తే కానీ, జన్మభూమి కమిటీలు ఒప్పుకుంటే కానీ రాలేదు. ఆ స్థాయిలో దిగజారిన కార్పొరేషన్‌ వ్యవస్థలో మార్పులు తెచ్చాం. బీసీ పేద వర్గాల ప్రతి ఇంట్లోనూ సంతోషం కనిపించాలి.

నాడు చెప్పా.. నేడు అమలు చేశా
మనం అధికారంలోకి వస్తే బీసీల జీవితాలు మారుస్తానని నాడు మాట ఇచ్చా. 90 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదలకు తోడుగా నిలబడకపోతే ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం? అని నేను ప్రతి రోజూ అనుకుంటూ ఉంటా. వారికి తోడుగా నిలబడడం కోసమే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని అనుకుంటా.

ఐదేళ్లలో విదిల్చింది రూ.19,329 కోట్లు..
2014 మేనిఫెస్టోలో టీడీపీ ఏం చెప్పిందో చూశాం. 118 వాగ్దానాలు ఇచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పింది. అంటే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేయాల్సి ఉంటే కేవలం రూ.19,329 కోట్లు మాత్రమే విదిల్చింది.

2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు..
మనందరి ప్రభుత్వం వచ్చాక బీసీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నా. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు చేయగలిగాం. ఒక్కో కుటుంబంలో ఆరేడు పథకాలు కూడా అందాయి. ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అట్టడుగున ఉన్న ఈ పేద వర్గాల కోసం మొత్తం రూ.59,317 కోట్లు చేశాం. తద్వారా 4.45 కోట్ల మందికి మేలు చేయగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 83 శాతం వరకు ఉన్నారు. ఏడాదిన్నరలో దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ స్వరాజ్యాన్ని చూస్తున్నాం.

అభివృద్ధి అంటే ఇదీ..
పిల్లలు మంచి చదువులు చదువుకుంటే అది అభివృద్ధిగా భావించి 100 శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నాం. కాళ్లు అరిగేలా తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా మన గ్రామంలోనే పనులు జరిగితేనే అభివృద్ధి జరిగినట్లు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇళ్లు వెతుక్కుంటూ వస్తేనే అభివృద్ధి అంటారు. నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మారుస్తున్నాం. అభివృద్ధిపై కోవిడ్‌ సమయంలో కూడా నాలుగు అడుగులు ముందుకే వేశాం కానీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు.

ఏడాదిన్నరలో ప్రత్యేకంగా ఇవీ
– శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు
– క్యాబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దాదాపు 60 శాతం పదవులు.
– ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే.
– సౌమ్యుడైన శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ కూడా బీసీనే.
– గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేం నలుగురిని రాజ్యసభకు పంపితే అందులో ఇద్దరు బీసీలే ఉన్నారు.
– నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం. అందులో సగం అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా చట్టం.

హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు..
బీసీల సంక్రాంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అంజాద్‌బాషా, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్, గుమ్మనూరు జయరామ్, ఎం.శంకరనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీసీలకు 18 నెలల్లో రూ.38,519 కోట్లు
రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చరిత్రను తిరగరాస్తూ బలహీనవర్గాలను బలపరిచేలా మరో అడుగు ముందుకు వేశాం. బీసీలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. అందులో 50 శాతం పదవులు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం మహిళాభ్యుదయంలో మరో చరిత్ర. అధికారంలోకి వస్తే బీసీల జీవితాలను మారుస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చా. ఈ 18 నెలల్లో అది చేసి చూపించా. బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం.

దిగిపోయిన పాలకుడి చెడిపోయిన బుర్ర..
ఈ అభివృద్ధి అంతా ఎక్కడ చూస్తారో అని ప్రజలను మభ్యపెట్టేందుకు గత పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఒక దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో చేస్తున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో రాజధాని అక్కడే పెట్టాలని ముందే నిర్ణయించి, బినామీలతో భూములు కొనిపించి ఇప్పుడు వాటి విలువ ఎక్కడ పడిపోతుందోనని ఆందోళన చేస్తున్నాడు. ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తుంటే అలా ఉంటుంది. ఒక మంచి బుర్ర పని చేస్తే అభివృద్ధి ఇలా ఉంటుందని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

బీసీ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: కొత్తగా నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, 672 మంది డైరెక్టర్లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంతి’ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తమ కులాల్లోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వానికి తమ కులాలకు మధ్య వారధిగా ఉంటామని బీసీ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, డైరెక్టర్లు ప్రతిజ్ఞ చేశారు.  
 


ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌


ముఖ్యమంత్రికి జ్ఞాపిక అందిస్తున్న మంత్రులు చెల్లుబోయిన, శంకర నారాయణ, జయరాం, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేశ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top