22 జిల్లాల్లో పూర్తిస్థాయి డీఈవోలు లేకుండానే.. | Assistant Directors and DIET lecturers given additional responsibilities as DEOs for 22 districts | Sakshi
Sakshi News home page

22 జిల్లాల్లో పూర్తిస్థాయి డీఈవోలు లేకుండానే..

Jun 15 2026 2:54 AM | Updated on Jun 15 2026 2:54 AM

Assistant Directors and DIET lecturers given additional responsibilities as DEOs for 22 districts

సీఎం చంద్రబాబు సొంత చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి  

ప్రభుత్వ తీరుపై విముఖతతో సెలవుపై వెళ్లిపోయిన అనంతపురం డీఈవో  

22 జిల్లాల డీఈవోలుగా అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డైట్‌ లెక్చరర్లకు అదనపు బాధ్యతలు  

జిల్లా అధికారులు లేకుండానే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల వేల్యూయేషన్‌ 

కీలక అధికారులు లేకుండానే 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో పాలన గాడితప్పింది. జిల్లా వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా విద్యాశాఖాధికారులు(డీఈవోలు) లేకుండానే 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమైపోయింది. స్కూళ్ల పర్యవేక్షణ, ఉచిత పుస్తకాల పంపిణీ, విద్యార్థుల బాగోగులతో పాటు విద్యాసంబంధమైన అన్ని వ్యవహారాలు చక్కబెట్టే కీలక అధికారులు లేకుండానే ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 22 జిల్లాలకు పూర్తిస్థాయి డీఈవోలు లేరు. వీరిస్థానంలో అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డైట్‌ లెక్చరర్లు డీఈవో కేడర్‌లో కొనసా­గుతున్నారు.

అర్హతలున్న సీనియర్‌ అధికారులను పక్కనబెట్టి జూనియర్లను ఉన్నతస్థాయి పోస్టుల్లో నియమించారు. పూర్తిస్థాయి డీఈవోలు ఉంటే తమ పనులకు అడ్డు తగులుతారనుకున్నారో లేక సొంత పనులు చేసేవారు ఉండరనుకున్నారోగానీ డీఈవోలను నియమించేందుకు మా­త్రం ప్రభుత్వం సుముఖత చూపడం లేదన్న విమర్శలు విద్యాశాఖలో వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరుకు డీఈవోను నియమించలేని దయనీయస్థితిలో విద్యాశాఖ ఉంది. గత డిసెంబర్‌లో సర్వీస్‌ రూల్స్‌ను పక్కనబెట్టి అనర్హులకు డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి స్థానిక కూటమి నాయకులు సొంత వ్యవహరాలు చక్కబెట్టుకుంటున్నట్టు విమర్శలున్నాయి.  

సీనియారిటీకి, అర్హతలకు తిలోదకాలు  
విశాఖ, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలు తప్ప మిగిలిన 22 జిల్లాల్లో డీఈవోలుగా జూని­యర్‌ అధికారులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగుల సర్వీస్‌ నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ డీఈవో పోస్టుకు ఏ అర్హతలు ఉండాలో పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) ఇవ్వాలన్నా అవే అర్హతలు తప్పనిసరి. కానీ ప్రభుత్వం కరెన్సీకి ప్రాధాన్యమిచ్చి నిబంధనలకు తిలోదకాలిచ్చిందన్న ఆరోపణలున్నాయి. గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం 13 జిల్లాల డీఈవోలను బదిలీ చేసింది. అంతకుముందు మరికొందరిని సర్దుబాటు చేసింది.

ఈ ప్రక్రియలో ఎక్కడా సీనియారిటీని పట్టించుకోలేదు. డీఈవోల నియామకంలో తొలుత డిప్యూటీ డైరెక్టర్లకు అవకాశం కల్పించాలి. కానీ వారిని ప్రాధాన్యం లేని శాఖల్లో సర్దుబాటు చేశారు. ఇక గతేడాది పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ సుమారు 100 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్ల సీనియారిటీ లిస్టును విడుదల చేసింది. ఇందులో అత్యంత జూనియర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లకు 22 జిల్లాల డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే 78 డీవైఈవో పోస్టుల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్లను నియమించాల్సి ఉన్నా, పలుచోట్ల టీచర్లకు అదనపు బాధ్యతలు, మరికొన్నిచోట్ల ఫిజికల్‌ డైరెక్టర్లను నియమించడంపై విమర్శలొస్తున్నాయి.  

ఉపాధ్యాయులకు ‘పేమెంట్‌’ బదిలీలు!
ఏటా ఉపాధ్యాయ బదిలీలుంటాయని, ఇందులో ఎవరి సిఫారసులు ఉండవని, అంతా పారదర్శకంగా ఆన్‌లైన్‌ విధానంలో చేపడతామని గతేడాది చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025 తీసుకొచ్చింది. దీని ప్రకారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బదిలీలు ఉంటాయన్నారు. కానీ చట్టంలోని ఓ నిబంధనను అడ్డుపెట్టుకుని రెండేళ్లుగా ‘పేమెంట్‌ బదిలీలు’ చేపడుతున్నారు. చట్టంలో అభ్యర్థన/పరస్పర/అంతర్‌ జిల్లా/అంతర్‌ రాష్ట్ర బదిలీలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్న క్లాజ్‌తో అంతా చక్కబెట్టుకుంటున్నారు.

స్థానిక నాయకుల సిఫారసు లేఖలతో ఇన్‌చార్జి డీఈవోలతో అక్రమ బదిలీలకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది బదిలీల నిషేధ సమయంలో 150 మందికి పైగా సిఫారసు లేఖలు తెచ్చుకున్న ఉపాధ్యాయులకు అంతర్‌ జిల్లాల బదిలీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కూడా భారీగా సిఫారసు బదిలీలు చేపట్టారు. ఒక్కో బదిలీకి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్టు ఉపాధ్యాయులే చెబుతున్నారు. తాజాగా విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో మరిన్ని బదిలీలకు రంగం సిద్ధం చేశారంటే పాఠశాల విద్యాశాఖలో అక్రమాలు ఎంత యథేచ్ఛగా జరుగుతున్నాయో తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement