breaking news
additional responsibilities
-
అడ్డదారిలో అదనపు బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా కొనసాగుతున్న ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతస్థాయి పోస్టుల్లో అదనపు బాధ్యతల అప్పగింత వివాదాస్పదమవుతోంది. ఈ విభాగానికి హెచ్ఓడీగా ఉన్న చీఫ్ ఇంజనీర్ జూన్ 30న పదవీ విరమణ పొందడంతో సీఈ పోస్టు ఖాళీ అయ్యింది. ఈ పోస్టుకోసం ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ (డీఈఈ) స్థాయిలోని పలువురు అధికారులు తీవ్రస్థాయిలో పోటీ పడ్డారు. దాదాపు రెండు నెలల పాటు ముమ్మరంగా ప్రయత్నించగా.. ఏటూరునాగారం సబ్ డివిజన్లో డీఈగా పనిచేస్తున్న ఎం.బాలును చీఫ్ ఇంజనీర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇస్తూ ఆగస్టు 30న అప్పటి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి వీఎస్ అలుగు వర్షిణి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె.. ఇక్కడినుంచి రిలీవ్ అవుతున్న రోజున ఈ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆ శాఖలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉత్తర్వులు వెలువడడంలో కార్యదర్శి పేషీలోని ఇద్దరు అధికారులు చక్రం తిప్పారంటూ ఇప్పుడు ఆ శాఖలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. సీనియారిటీ, ఆర్వోఆర్ మెరిట్‌కు మంగళం... సాధారణంగా ఒక ప్రభుత్వ శాఖలో హెచ్ఓడీ లేదా ఆ తర్వాతి స్థాయి పోస్టులో పదోన్నతి లేదా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇచ్చే క్రమంలో సీనియారిటీకి తొలి ప్రాధాన్యం దక్కుతుంది. సీనియారిటీ జాబితా ఆధారంగా తొలివరుసలో ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తారు. ఈ జాబితా రూపకల్పనలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కమ్ మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. కానీ ఈ శాఖలో చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇవ్వడంలో ఈ నిబంధనలు పాటించలేదని విమర్శలు ఉన్నాయి. ఏకపక్షంగా ఎఫ్ఏసీ ఇచ్చారని కొందరు ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా, సీనియారిటీ జాబితాను పరిగణించకుండా ఏకపక్షంగా రూపొందించిన ఫైలుకు గత కార్యదర్శి ఆమోదం తెలపడం ఇప్పుడు ఆ విభాగంలో దుమారం రేపుతోంది. ఈ నిర్ణయంతో రిజర్వేషన్ల ఫలాలు అందకుండా.. కేవలం ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఎఫ్ఏసీ బాధ్యతలు ఇవ్వడం వెనుక మతలబుందని అధికారులు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పేషీలోని ఇద్దరు అధికారుల వల్లే? గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగంలో ఏడుగురు ఇంజనీర్లకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కట్టబెడుతూ ఆగస్టు 30న జీవో 242 జారీ అయ్యింది. ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, చీఫ్ ఇంజనీర్‌గా ఏటూరునాగరంలో డీఈఈగా పనిచేస్తున్న ఎం.బాలుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా డీఈఈ కేడర్‌లో ఉన్న ఆర్డీ ఫణికుమారికి సీఈ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ప్లానింగ్ అండ్ మానిటరింగ్)గా, ఎ.హేమలతను సీఈ కార్యాలయంలో ఈఈ(పీఎం)గా, జె.తానాజీని ఉట్నూరు ప్రాజెక్టులో ఈఈగా, సీహెచ్ సత్యనారాయణను భద్రాచలం ప్రాజెక్టులో ఈఈగా, కె.రామకృష్ణను ఏటూరునాగారం ప్రాజెక్టులో ఈఈగా నియమించారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) కేడర్‌లో ఉన్న కె.జగజ్యోతికి గిరిజన గురుకుల సొసైటీలో పోస్టింగ్ ఇచ్చారు. వాస్తవానికి సీనియారిటీ జాబితాలో ముందువరుసలో ఉన్న ఆమెకు అప్రాధాన్య పోస్టు ఇవ్వడంపై ఆమె ఇప్పటికే సంక్షేమ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎఫ్ఏసీ బాధ్యతల ఉత్తర్వుల జారీలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కార్యాలయంలోని ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషించారని, కార్యదర్శి బాధ్యతల నుంచి రిలీవ్ అవుతున్న చివరి నిమిషంలో ఫైలును సర్క్యులేట్ చేశారని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ వ్యవహారంలో ఇంజనీర్లు, అధికారుల మధ్య లావాదేవీలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి. -
ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
హైదరాబాద్: హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ ఉత్తర్వులు విడుదల చేశారు. హెచ్‌జీసీఎల్ ఇన్చార్జి ఎండీగా విధులు నిర్వహించిన అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తన పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమ్రపాలికి హెచ్‌జీసీఎల్ నిర్వహణ, పర్యవేక్షణపై ఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆమె ఔటర్‌రింగ్‌రోడ్డు ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌గా, స్పెషల్ కలెక్టర్‌గా కూడా విధులు నిర్వహించనున్నారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీకి ఎండీగా కూడా ఆమె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పేర్ని వెంకట్రామయ్యకు (నాని) రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలను కూడా కేటాయించింది. ఈమేరకు బుధవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జిఓఎంఎస్ సంఖ్య 144 ద్వారా రాజపత్రం(గెజిట్ నోటిఫికేషన్) జారీచేశారు. చదవండి: (బస్సు ప్రమాదం: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా) -
అది అత్యంత కఠిన సమయం!
చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా తాను అదనపు బాధ్యతలు నిర్వర్తించిన 13 నెలల కాలం ఆ రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత క్లిష్టమైన దశ అని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అభివర్ణించారు. అధినేత్రి జయలలిత మరణం అనంతరం అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభం.. తదనంతర పరిణామాలు అత్యంత సున్నితమైనవన్నారు. ‘దోజ్ ఈవెంట్ఫుల్ డేస్’ పేరుతో నాటి పరిణామాల్ని అక్షరబద్ధం చేసిన పుస్తకాన్ని సోమవారం రాజ్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. విద్యాసాగర్ రావు గవర్నర్‌గా ఉన్న సమయంలోనే జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, ఆ తరువాత మరణించడం, వార్దా తుపాను, జల్లికట్టు నిరసనలు.. మొదలైన అత్యంత సున్నిత ఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన తనను నాటి సీఎం జయలలిత విమానాశ్రయానికి వచ్చి ఆహ్వానించడాన్ని విద్యాసాగర్ రావు గుర్తు చేసుకుంటూ.. ఆమె అంటే తనకెంతో గౌరవమన్నారు. పళనిస్వామి ప్రభుత్వంపై 19 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు బలపరీక్ష నిర్వహించకపోవడంపై విద్యాసాగర్ రావుపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. -
అదనపు బాధ్యతల తొలగింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : డిప్యూటీ డీఈఓ అదనపు బాధ్యతల నుంచి విద్యాశాఖ ఏడీ చంద్రలీలను తప్పించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు పాఠశాల విద్యా కమిషనర్ నుంచి బుధవారం ఉత్తర్వులు అందాయి. ఈ విషయం విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రలీల మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈమెకు ధర్మవరం డివిజన్ డిప్యూటీ డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే తాడిపత్రి మోడల్ స్కూల్లో 2014 నుంచి 2016 వరకు దాదాపు రెండేళ్లపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు కాలేదని తెలిసింది. ఈ విషయంలో కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులకు విచారణకు ఆదేశించారు. వారి నివేదిక ఆధారంగా అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించారు. దీనిపై డీఈఓ అంజయ్యను వివరణ కోరగా డిప్యూటీ డీఈఓ అదనపు బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు వచ్చింది వాస్తవమన్నారు. -
అధికారులకు కీలకశాఖల అదనపు బాధ్యతలు
హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విదేశీ పర్యటనకు వెళుతున్న సందర్భంగా పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ పర్యటనలో భాగంగా ఉన్నతాధికారులు యూఎస్, యూకే దేశాలు సందర్శించనున్నారు. అక్కడి మోడ్రన్ పోలీసింగ్, సీసీ కెమెరాల వ్యవస్థ ఇతర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. *రామకృష్ణారావు ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ స్థానంలో శివశంకర్ కు అదనపు బాధ్యతలు. *రాజీవ్ త్రివేదీ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ స్థానంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హాకు అదనపు బాధ్యతలు. *అనురాగ్ శర్మ డీజీపీ స్థానంలో అదనపు డీజీ సుదీప్ లక్టాకియాకు అదనపు బాధ్యతలు. *మహేందర్ రెడ్డి పోలీస్ కమిషనర్, హైదరాబాద్ స్థానంలో అదనపు కమిషనర్ జితేందర్ కు అదనపు బాధ్యతలు.. వీరంతా పదిరోజుల పాటు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. -
రోశయ్యకు అదనపు బాధ్యతలు
- కర్ణాటక ఇన్చార్జ్ గవర్నర్‌గా నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన రాష్ర్టపతి ప్రణబ్ చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యకు కర్ణాటక గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. 2009లో కర్ణాటక గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన హెచ్ఆర్ భరధ్వాజ్ పదవీ కాలం శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్‌ను నియమించే వరకు కర్ణాటక గవర్నర్‌గా అదనపు బాధ్యతలను రోశయ్యకు అప్పగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలా ఉండగా పుదుచ్చేరి గవర్నర్ లెఫ్టినెంట్ వీరేంద్రకటారియా శుక్రవారం చెన్నై రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ రోశయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. -
రెండిళ్ల పూజారి!
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. ఎంతో కీలకమైన ప్రభుత్వ విభాగం. జిల్లాలో ప్రతిరోజూ వందలాది క్రయ విక్రయాలు, లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదా యం సమకూరుతుంది. వీటిని పర్యవేక్షించటం, కొన్నింటిని స్వయంగా నిర్వహించటం జిల్లా రిజిస్ట్రార్ బాధ్యత. అలాంటిది రెండు జిల్లాల బాధ్యతను ఒక్క అధికారే నిర్వర్తిస్తే అటు క్రయవిక్రయదారులు, ఇటు న్యాయవాదులకు ఇక్కట్లు తప్పవు. జిల్లాలో 8 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదు. ఇదీ సంగతి.. విజయనగరం జిల్లా రిజిస్ట్రార్ ఆర్.సత్యనారాయణ 8 నెలలుగా ఈ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సహజంగానే విజయనగరం జిల్లా వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న ఆయన ఈ జిల్లాకు వారానికి రెండు రోజులు కూడా కేటాయించటం లేదని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. దీంతో పలు కీలక వ్యవహారాలు, చిట్స్ కే సులు, ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ముఖ్యంగా కోర్టుకు సంబంధించి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే విషయంలోను, చిట్ ఫండ్ యాక్ట్ కేసుల వ్యవహారాలపై వాయిదాలు ఇచ్చే అధికారం జిల్లా రిజిస్ట్రార్‌కే ఉంది. అయితే ఇన్చార్జి రిజిస్ట్రార్ సరిగా రాకపోవటంతో జిల్లాలో ఈ వ్యవహారాలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆయన ఎప్పుడుం టారో తెలియక కక్షిదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని ఓ న్యాయవాది చెప్పారు. మరోవైపు.. ఈ జిల్లాలోని 13, విజయనగరం జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొద్ది నెలలుగా నిలిచిపోయాయి. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు జిల్లా కేంద్రంలోని జాయింట్ రిజిస్ట్రార్-1 పోస్టు కూడా ఖాళీగా ఉండడంతో భూముల రిజిస్ట్రేషన్లు కొంతమేర మందగించాయి. ప్రస్తుతం జాయింట్ రిజిస్ట్రార్-2 పోస్టులో రెగ్యులర్‌గా ఉన్న ఎస్.రాజేశ్వరరావు జాయింట్-1 రిజిస్ట్రార్‌గా ఇన్చార్జి విధుల్లో ఉండగా, జాయింట్-2 రిజిస్ట్రార్ ఇన్చార్జి బాధ్యతలను సీనియర్ ఉద్యోగి రాఘవులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. -
అదనపు బాధ్యతలతో బోధనకు దూరం
మార్కాపురం, న్యూస్‌లైన్: ఇన్‌చార్జ్‌ల పాలనతో జిల్లాలో విద్యాశాఖ గాడితప్పుతోంది. 56 మండలాల్లో కేవలం 9 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన మండలాల్లో లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. జిల్లావ్యాప్తంగా 424 ఉన్నత పాఠశాలలు, 2,942 ప్రాథమిక, 419 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ఇదే సమయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పిల్లలకు పాఠాలు చెప్పలేకపోతున్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజన పథకం, స్కాలర్‌షిప్‌ల పంపిణీ, ఏకరూప దుస్తులు, పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంఈఓలదే. ప్రస్తుతం జిల్లాలో కొమరోలు, దోర్నాల, సంతనూతలపాడు, అద్దంకి, మర్రిపూడి, కొరిశపాడు, కారంచేడు, ఉలవపాడు తదితర మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలుండగా మిగిలిన మండలాల్లో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. పదేళ్ల నుంచి ఎంఈఓల నియామకంపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయి. జిల్లా పరిషత్ టీచర్లు, ప్రభుత్వ టీచర్ల మధ్య ఎంఈఓల పదోన్నతులు, నియామకాలపై సందిగ్ధత నెలకొంది. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలనలో విద్యాశాఖ నడుస్తోంది. ప్రధానోపాధ్యాయులు పాఠశాలల తనిఖీలు, విద్యార్థుల ప్రగతి, పాఠశాల నిధుల వినియోగం, ఎస్ఎంసీ సమావేశాలు తదితర కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. వారిని ఎఫ్ఏసీ ఎంఈఓలుగా నియమించడంతో ఓ వైపు పాఠశాల నిర్వహణ, మరోవైపు ఎంఈఓల బాధ్యతలు భారంగా మారాయి. ఇరువైపులా పర్యవేక్షణ కష్టమవుతోంది. ఇబ్బంది లేకుండా చూస్తున్నాం -రాజేశ్వరరావు, డీఈఓ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓల సమస్య ఉంది. జిల్లాలో పదేళ్ల నుంచి రెగ్యులర్ ప్రతిపాదికపై ఎంఈఓల నియామకం లేకపోవడంతో సమీపంలో ఉన్న హెచ్ఎంలను ఎఫ్ఏసీ ఎంఈఓలుగా నియమించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.