
గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఇష్టారాజ్యం
నిబంధనలకు విరుద్ధంగా పలువురు జూనియర్లకు పెద్ద పోస్టుల్లో ఎఫ్‌ఏసీ
సీనియారిటీ, ఆర్వోఆర్‌ను పట్టించుకోకుండానే పూర్తిస్థాయి బాధ్యతలు
సచివాలయంలోని కార్యదర్శి పేషీలో చక్రం తిప్పిన ఇద్దరు అధికారులు?
చివరి నిమిషంలో ఉత్తర్వులిచ్చిన గత కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా కొనసాగుతున్న ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతస్థాయి పోస్టుల్లో అదనపు బాధ్యతల అప్పగింత వివాదాస్పదమవుతోంది. ఈ విభాగానికి హెచ్‌ఓడీగా ఉన్న చీఫ్ ఇంజనీర్ జూన్ 30న పదవీ విరమణ పొందడంతో సీఈ పోస్టు ఖాళీ అయ్యింది. ఈ పోస్టుకోసం ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ (డీఈఈ) స్థాయిలోని పలువురు అధికారులు తీవ్రస్థాయిలో పోటీ పడ్డారు.
దాదాపు రెండు నెలల పాటు ముమ్మరంగా ప్రయత్నించగా.. ఏటూరునాగారం సబ్ డివిజన్‌లో డీఈగా పనిచేస్తున్న ఎం.బాలును చీఫ్ ఇంజనీర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇస్తూ ఆగస్టు 30న అప్పటి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి వీఎస్ అలుగు వర్షిణి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె.. ఇక్కడినుంచి రిలీవ్ అవుతున్న రోజున ఈ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆ శాఖలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉత్తర్వులు వెలువడడంలో కార్యదర్శి పేషీలోని ఇద్దరు అధికారులు చక్రం తిప్పారంటూ ఇప్పుడు ఆ శాఖలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
సీనియారిటీ, ఆర్వోఆర్ మెరిట్‌కు మంగళం...
సాధారణంగా ఒక ప్రభుత్వ శాఖలో హెచ్‌ఓడీ లేదా ఆ తర్వాతి స్థాయి పోస్టులో పదోన్నతి లేదా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇచ్చే క్రమంలో సీనియారిటీకి తొలి ప్రాధాన్యం దక్కుతుంది. సీనియారిటీ జాబితా ఆధారంగా తొలివరుసలో ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తారు. ఈ జాబితా రూపకల్పనలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కమ్ మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. కానీ ఈ శాఖలో చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) ఇవ్వడంలో ఈ నిబంధనలు పాటించలేదని విమర్శలు ఉన్నాయి.
ఏకపక్షంగా ఎఫ్‌ఏసీ ఇచ్చారని కొందరు ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా, సీనియారిటీ జాబితాను పరిగణించకుండా ఏకపక్షంగా రూపొందించిన ఫైలుకు గత కార్యదర్శి ఆమోదం తెలపడం ఇప్పుడు ఆ విభాగంలో దుమారం రేపుతోంది. ఈ నిర్ణయంతో రిజర్వేషన్ల ఫలాలు అందకుండా.. కేవలం ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఎఫ్‌ఏసీ బాధ్యతలు ఇవ్వడం వెనుక మతలబుందని అధికారులు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
పేషీలోని ఇద్దరు అధికారుల వల్లే?
గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగంలో ఏడుగురు ఇంజనీర్లకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కట్టబెడుతూ ఆగస్టు 30న జీవో 242 జారీ అయ్యింది. ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, చీఫ్ ఇంజనీర్‌గా ఏటూరునాగరంలో డీఈఈగా పనిచేస్తున్న ఎం.బాలుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
అదేవిధంగా డీఈఈ కేడర్‌లో ఉన్న ఆర్‌డీ ఫణికుమారికి సీఈ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ప్లానింగ్ అండ్ మానిటరింగ్)గా, ఎ.హేమలతను సీఈ కార్యాలయంలో ఈఈ(పీఎం)గా, జె.తానాజీని ఉట్నూరు ప్రాజెక్టులో ఈఈగా, సీహెచ్ సత్యనారాయణను భద్రాచలం ప్రాజెక్టులో ఈఈగా, కె.రామకృష్ణను ఏటూరునాగారం ప్రాజెక్టులో ఈఈగా నియమించారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) కేడర్‌లో ఉన్న కె.జగజ్యోతికి గిరిజన గురుకుల సొసైటీలో పోస్టింగ్ ఇచ్చారు.
వాస్తవానికి సీనియారిటీ జాబితాలో ముందువరుసలో ఉన్న ఆమెకు అప్రాధాన్య పోస్టు ఇవ్వడంపై ఆమె ఇప్పటికే సంక్షేమ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎఫ్‌ఏసీ బాధ్యతల ఉత్తర్వుల జారీలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కార్యాలయంలోని ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషించారని, కార్యదర్శి బాధ్యతల నుంచి రిలీవ్ అవుతున్న చివరి నిమిషంలో ఫైలును సర్క్యులేట్ చేశారని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ వ్యవహారంలో ఇంజనీర్లు, అధికారుల మధ్య లావాదేవీలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి.