
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ఓడిద్దాం
ముస్లింలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పిలుపు
కర్నూలు (టౌన్): బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మద్దతుగా నిలిచి ముస్లింలను దగా చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ‘వక్ఫ్ బచావో.. దస్తూర్ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ మరువరన్నారు. టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బయటకు రావాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణల్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు వచి్చనా టీడీపీ, జనసేన పార్టీలను చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు రూ.వేల కోట్లను ఆయన వర్గీయులు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. వక్ఫ్ అమలుకు ప్రతి ముస్లిం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల ఏరివేత ముసుగులో ముస్లింలను బీజేపీ ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తోందన్నారు. పహల్గాంలో అమాయకులను ఊచకోత కోసిన నిందితులను మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోందని ప్రశ్నించారు.
ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో పేట్రేగిపోతోందని, మసీదులు, దర్గాలను టార్గెట్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫర్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ముస్లిం మతపెద్దలు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
