వెంచర్‌ను దున్నిన కేసులో టీడీపీ నేతల అరెస్టు 

Arrest of TDP leaders in the case of plowing the venture - Sakshi

చక్రాయపేట: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలంలోని సురభి గ్రామం నాగలగుట్టపల్లెలో ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను దౌర్జన్యంగా దున్నేసిన కేసులో ఎనిమిది మంది టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌చేశారు. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవితోపాటు వందలాది మంది ఆయన అనుచరులు ఇటీవల నాగలగుట్టపల్లెలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను ట్రాక్టర్‌తో దున్నేసి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే.

బీటెక్‌ రవి, స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు మహేశ్వరరెడ్డితోపాటు సుమారు 200 మందిపై బాధిత వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మంగళవారం శంకర్‌రెడ్డి, యోగీశ్వరరెడ్డి, కుమార్‌రెడ్డి, వెంకటవిజయభాస్కర్‌రెడ్డి, రామాంజులరెడ్డి, రెడ్డెయ్య, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, రాజేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చక్రాయపేట ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.

వెంచర్‌ను దున్నేసినవారిలో ఇప్పటి వరకు 32మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేయగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ ఘటనలో పాల్గొన్నవారిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులైన బీటెక్‌ రవితోపాటు మహేశ్వరరెడ్డి, మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top