ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమన్న ఉద్యోగ సంఘాల నేతలు
పోరుబాటకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటు
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
సాక్షి, అమరావతి/బస్టాండ్ (విజయవాడ పశ్చిమ): ఈ–బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఆర్టీసీ పరిరక్షణ కోసం ఎంతటి తీవ్రమైన ఉద్యమానికైనా సిద్ధమని తేల్చి చెప్పాయి. విజయవాడలో సోమవారం నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఉద్యమపంథాను నిర్ణయించేందుకు ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేశారు. జేఏసీ కన్వీనర్లుగా వై.శ్రీనివాసరావు (ఎన్‌ఎంయూ), పి.దామోదరరావు(ఈయూ)లను ఎన్నుకున్నారు. పి.వి.రమణారెడ్డి (ఎన్‌ఎంయూ), జి.వి.నరసయ్య (ఈయూ), సీహెచ్. సుందరరామయ్య, కట్టా సుబ్రహ్మణ్యం (ఎస్‌డబ్లూఎఫ్), ఎస్.వి.శేషగిరిరావు, వై.శ్రీనివాసరావు (కార్మికపరిషత్), కె.సూర్యప్రకాశరావు(యునైటెడ్ వర్కర్స్ యూనియన్), డి.మాల్యాద్రి (కారి్మకసంఘ్) కో కన్వీనర్లుగా వ్యవహరిస్తారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రను తిప్పికొడతాం
ఆరీ్టసీని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నుతోందని జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పి.దామోదరరావు విమర్శించారు. ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోకుండా ఈ–బస్సులు, ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం రాష్ట్ర ప్రజలకు, ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్రనష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నాలను ఉద్యోగులంతా అడ్డుకుంటారని తేల్చి చెప్పారు.
విద్యుత్ బస్సులను ఆర్టీసీయే స్వయంగా నిర్వహించాల¯న్నారు. విద్యుత్ బస్సుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వడం కాకుండా ఆర్టీసీయే సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ అవసరాలకు తగినట్లు నాలుగువేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నాలను వ్యతిరేకిస్తూ తొలిదశ ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రకటించింది. అప్పటికీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది.
ఉద్యమ కార్యాచరణ
⇒ ఈనెల 11న ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఎండీకి వినతిపత్రాల సమర్పణ
⇒ 16 నుంచి 20 వరకు రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలో ఐదు సన్నాహక సదస్సుల నిర్వహణ. 16న విజయనగరం, 17న విజయవాడ, 18న నెల్లూరు, 19న తిరుపతి, 20న అనంతపురంలలో సదస్సులు.
⇒ 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని డిపోలు, యూనిట్లలో ధర్నాలు


