కోడిగుడ్డు.. ఏపీ రికార్డు.. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే..

AP is the top in the country in availability and production of chicken eggs - Sakshi

కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో దేశంలోనే ఏపీది అగ్రస్థానం

రాష్ట్రంలో ఏటా తలసరి గుడ్ల లభ్యత 501

ఏటా 442 గుడ్ల లభ్యతతో రెండో స్థానంలో తెలంగాణ

జాతీయ సగటు గుడ్ల లభ్యత 95 మాత్రమే

రాష్ట్రంలో రెండేళ్లుగా పెరుగుతున్న పెరటి కోళ్ల సంఖ్య

కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే–2022 వెల్లడి

సాక్షి, అమరావతి: కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత దేశంలో మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే–2022 వెల్లడించింది.

దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో తలసరి గుడ్ల లభ్యత అత్యధికంగా ఉందని.. ఏపీలో ఆంధ్రప్రదేశ్‌ ఏడాదికి తలసరి 501 గుడ్ల లభ్యతతో నంబర్‌–1 స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. గుడ్ల లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సర్వే పేర్కొంది. తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా.. దేశవ్యాప్తంగా ఏడాదికి సగటు తలసరి గుడ్ల లభ్యత కేవలం 95 మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. 

1950లో ఏడాదికి 5 గుడ్లే
1950–51 కాలంలో ఏడాదికి తలసరి కోడిగుడ్ల లభ్యత మన దేశంలో కేవలం ఐదు మాత్రమే ఉండగా.. 1960–61లో కేవలం 7 మాత్రమే ఉంది. తొలిసారిగా 1968–69లో జాతీయ స్థాయిలో సగటు తలసరి గుడ్ల లభ్యత 10కి చేరిందని సర్వే పేర్కొంది. 2020–21లో జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి గుడ్ల లభ్యత 90 ఉండగా 2021–22లో 95కు చేరినట్టు వెల్లడించింది.

మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే
కాగా.. కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలోనూ దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల లభ్యతలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు గుడ్ల ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలోను.. గుడ్ల లభ్యతలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఉత్పత్తిలో మాత్రం మూడో స్థానంలోనూ ఉన్నాయని సర్వే విశ్లేషించింది.

దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్‌ ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళ­నాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రా­ల్లోనే 64.56 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నా­యని సర్వే వెల్లడించింది. దేశంలో 2021–22లో 129.60 బిలియన్‌ కోడిగుడ్లు ఉత్పత్తి కాగా.. వాణిజ్య పౌల్ట్రీల ద్వారా 109.93 బిలియన్‌ గుడ్లు ఉత్పత్తి అయినట్టు, పెరటి పౌల్ట్రీల ద్వారా 19.67 బిలియన్‌ గుడ్లు ఉత్పత్తి అయినట్టు సర్వే పేర్కొంది.

రాష్ట్రంలో మూడేళ్లుగా (2019–20 నుంచి 2021–22) వరకు కోడిగుడ్ల ఉత్పత్తి పెరుగుతోందని సర్వే వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో పెరటి కోళ్ల సంఖ్య కూడా రెండేళ్లుగా పెరిగిం­దని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 2020–21లో పెర­టి కోళ్ల సంఖ్య 1,23,70,740 ఉండగా.. 2021–22లో 1,31,69,200కు పెరిగినట్టు సర్వే స్పష్టం చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top