మీ వైఫల్యం వల్లే.. సాగర్‌ స్పిల్‌ వే సగం స్వాధీనం | Sakshi
Sakshi News home page

మీ వైఫల్యం వల్లే.. సాగర్‌ స్పిల్‌ వే సగం స్వాధీనం

Published Sat, Dec 2 2023 4:19 AM

AP: Shasibhushan Kumar letter to Krishna Board Chairman - Sakshi

సాక్షి, అమరావతి : ఉమ్మడి ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్‌ను నియంత్రంచడంలో మీ వైఫల్యంవల్లే మా భూభాగంలోని నాగార్జునసాగర్‌ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను గురువారం స్వాదీనం చేసుకున్నామని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఏపీకి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసం సాగర్‌ కుడి కాలువకు విడుదల చేశామని స్పష్టంచేసింది.

ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం రాత్రి లేఖ రాశారు. సాగర్‌ స్పిల్‌వేలో సగభాగాన్ని ఏపీ స్వాదీనం చేసుకుందని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్‌ ఫిర్యాదు చేసింది. కుడి కాలువకు నీటి విడుదలను ఆపేలా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని ఆ లేఖలో కోరింది. తెలంగాణ సర్కార్‌ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు ఏపీ సర్కార్‌కు శుక్రవారం లేఖ రాసింది. తక్షణమే నీటి విడుదలను నిలిపేయాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చుతూ శశిభూషణ్‌కుమార్‌ బదులిచ్చారు. ఏపీ లేఖలో ప్రధానాంశాలివీ.. 

► శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈకి, సాగర్‌ నిర్వహణ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈకి అప్పగించారు. 2014 నుంచే తెలంగాణ భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్స్‌  సీఈకి అప్పగించకుండా.. తానే నిర్వహిస్తోంది. అదే సమయంలో మా భూభాగంలోని సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను సైతం తెలంగాణ తన అదీనంలోకి తీసుకుంది.  

► గత తొమ్మిదేళ్లుగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ సాగర్‌కు తరలించి.. అటు సాగర్‌ ఎడమ కాలువలో తమ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందిస్తూ రాష్ట్ర హక్కులను తెలంగాణ హరిస్తోందని అనేకసార్లు బోర్డుకు ఫిర్యాదు చేశాం. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను స్వాదీనం చేసుకోవాలని బోర్డును అనేకసార్లు కోరాం. లేదంటే ఏపీ భూభాగంలోని సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఏపీకి  అప్పగించాలని కోరాం. కానీ, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  

► అక్టోబరు 6న త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, సాగర్‌ నుంచి 15 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చింది. తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ యథావిధిగా అదే రోజున ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించి శ్రీశైలాన్ని తెలంగాణ సర్కార్‌ ఖాళీచేస్తూ వచ్చింది. దీనిపై అప్పుడే బోర్డుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనివల్ల శ్రీశైలంలో మాకు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలనే వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ చర్యలవల్ల 17 టీఎంసీలను కోల్పోయాం.  

► సాగర్‌ కుడి కాలువ కింద మాకు కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు ఐదు టీఎంసీలు వాడుకున్నాం. మిగతా పది టీఎంసీలను వాడుకోనివ్వకుండా సాగర్‌ను తెలంగాణ ఖాళీచేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్‌గా మారుతుందన్న ఆందోళనతోనే సాగర్‌ స్పిల్‌ వేను స్వాదీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి మా హక్కులను పరిరక్షించుకున్నాం. నీటి విడుదలను ఆపే ప్రశ్నేలేదు.  

నేడు రెండు రాష్ట్రాలతో కేంద్రం భేటీ 
కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర భూభాగంలోని నాగార్జునసాగర్‌ స్పిల్‌ వే సగం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. సాగర్‌ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌ల నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ తదితరులు పాల్గొనే ఈ సమావేశం శనివారం ఉ.11గంటలకు హైబ్రీడ్‌ విధానంలో (వీడియో కాన్ఫరెన్స్‌) జరుగుతుంది. గత తొమ్మిదేళ్లుగా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్‌ హరిస్తున్న తీరును ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి మరోసారి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement