
గత ప్రభుత్వంలో భారీగా తగ్గిన డిస్కంల నిర్వహణ వ్యయాలు
ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ కలిపి రూ.3,374.75 కోట్లు
ఏపీ ట్రాన్స్‌కో నుంచి మిగిలింది రూ.1,059.76 కోట్లు
మొత్తం రూ.4,434.51 కోట్లు ఆదా
కూటమి ప్రభుత్వంపై ఈ మేరకు తగ్గిన భారం
ఏపీఈఆర్‌సీకు డిస్కంల ‘ట్రూ డౌన్ పిటిషన్లు’ వెల్లడి
సాక్షి, అమరావతి: సమర్థుడైన నాయకుడి పాలనలో వ్యవస్థలు ఎంతగా అభివృద్ధి చెందుతాయన్నది చెప్పడానికి ఇదొక నిదర్శనం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకువచ్చిన వినూత్న విధానాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కం) నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపింది. కానీ, గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో మొత్తం రూ.4,434.51 కోట్ల నిర్వహణ ఖర్చులు ఆదా అయ్యేలా చేసింది. ఈ మేరకు డిస్కంలు దాఖలు చేసిన ట్రూ డౌన్ పిటిషన్ల వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తన వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది.
డిస్కంల మిగులు ఇలా..
2019–20 నుంచి 2023–24 వరకూ ఏపీఈపీడీసీఎల్ నిర్వహణా వ్యయాల ఆదా రూ.1,974.75 కోట్లు
ఏపీసీపీడీసీఎల్ 2020–21 నుంచి 2023–24 వరకూ వ్యయ ఆదా రూ.1,400 కోట్లు.
ఈ మొత్తం రూ.3,374.75 కోట్లు.
ఇందులో కొంత మొత్తాలను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్‌ఆర్)లో డిస్కంలు సర్దుబాటు చేసుకున్నాయి.
అంటే వాటి రెవెన్యూ గ్యాప్‌ను భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి.
ఈ విధంగా ఏపీఈపీడీసీఎల్ రూ.1,800 కోట్లు కలపగా, మిగిలిన రూ.174.75 కోట్లను సర్దుబాటు చేయాల్సి ఉంది.
అదేవిధంగా ఏపీసీపీడీసీఎల్‌లో రూ.478.91 కోట్లు ఇప్పటికే 2024–25 ఏఆర్‌ఆర్‌లో కలిపారు. ఇంకా రూ.921.09 కోట్లు ఉన్నాయి.
ఈ మొత్తం రూ.1,095.84 కోట్లు ప్రజలకు తిరిగి ఇచ్చేయాలా... లేక మరో ఏఆర్‌ఆర్‌లో సర్దుబాటు చేయాలా.. అనేది ఏపీఈఆర్‌సీ నిర్ణయిస్తుంది.
ట్రాన్స్‌కో ఆదా ఇది..
2019–20 నుంచి 2023–24 మధ్య ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లను వినియోగించుకోవడంలోనూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) రూ.1,059.76 కోట్లు మిగిల్చాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఈఆర్‌సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కంలు వినియోగించాయి. ఇది ఏపీఈపీడీసీఎల్‌లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌లో రూ. 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్‌ఆర్‌లో సర్దుబాటు చేశారు. ఈ లెక్కన గత ప్రభుత్వ చర్యల కారణంగా కూటమి ప్రభుత్వంపై రూ.4,434.51 కోట్ల భారం తగ్గింది.
దక్షిణ డిస్కంలో భిన్నం.. కానీ..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) మాత్రం రూ.3,346 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలుకు ఏపీఈఆర్‌సీని అనుమతి కోరింది. ఇందులోనూ 2024–25 ఏఆర్‌ఆర్‌లో రూ.2వేల కోట్లు సర్దుబాటు చేసేశారు. అంటే అప్పటికి డిస్కంకు ఆ మేరకు లాభం చేకూరినట్టే. ఇక మిగిలింది రూ.1,346 కోట్లు. డిస్కం దాఖలు చేసిన వడ్డీలను ఏపీఈఆర్‌సీ యథాతథంగా ఆమోదించదు. అందువల్ల ఈ ట్రూ అప్ కూడా తగ్గే అవకాశం ఉందని ఏపీఈఆర్‌సీ వెల్లడించింది.