మేమంటే బాబుకు ఎందుకంత కక్ష | Sakshi
Sakshi News home page

మేమంటే బాబుకు ఎందుకంత కక్ష

Published Tue, Apr 2 2024 1:42 PM

AP Pensioners Fire On Chandrababu Over Stopping AP Volunteers - Sakshi

‘మేం ఏం పాపం చేశాము. మాపైన వాళ్లకు ఎందుకంత పగ. వలంటీర్లపై కక్షగట్టి మా నుంచి దూరం చేశారు. ఒకటో తేదీ తెల్లవారేసరికి ఇంటికొచ్చే పెన్షన్‌ని రానీయకుండా చేశారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి.  మళ్లీ మేము క్యూల్లో నిలబడాలా..?. మండుటెండల్లో సొమ్మసిల్లి పడిపోవాలా..?. పనులు మానుకుని.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరీక్షించాలా..?’ అంటూ పెన్షన్‌ దారులు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబునాయుడు అండ్‌ కో.. వలంటీర్లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్‌ వారిని సంక్షేమ పథకాల నుంచి మినహాయించింది. లబి్ధదారులకు ఒకటో తేదీ అందాల్సిన పెన్షన్‌ అందకుండా పోయింది. దీంతో లబి్ధదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు.  

 

గుడ్డివారి గోష్ట టీడీపీకి తగులుతుంది 
నాకు కంటి చూపులేదు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే మనిషి తోడుకావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే ప్రతినెలా ఒకటవ తేదీ గ్రామ వలంటీర్‌ ద్వారా పింఛన్‌ అందుకునేదాన్ని. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఈ నెల నుంచి ఎన్నికల సాకు చూపి వలంటీర్లను ప్రభుత్వ సేవల నుంచి పక్కన పెట్టడం దురదృష్టకరం. నా లాంటి కంటిచూపు లేని వాళ్లు ఎక్కడో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి క్యూలో నిలబడి పింఛన్‌ ఎలా తీసుకోవాలి..?. మాలాంటి వారి గోడు తప్పక తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాము.గత 58 నెలలు ఆ బాధల నుంచి జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని విముక్తి లభించింది. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్‌ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. 
–నాగమ్మ, వెంగారెడ్డికండ్రిగ, వరదయ్యపాళెం మండలం 

లేవలేని స్థితిలో ఉన్నా  
నాకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి కదల్లేక మంచానికే పరిమితమైనాను. నెలనెలా వచ్చే పింఛనుపైనే మందులుమాకులు ఇతరులతో చెప్పి తెప్పించుకునేవాడిని. ప్రతినెలా ఒకటో తారీఖున వలంటీర్‌ నిద్రలేపి నా వేలిముద్ర తీసుకుని ఇంటివద్దనే పింఛన్‌ ఇచ్చేవాడు. ఈ రోజు(సోమవారం) పింఛన్‌ ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోమంటున్నారు. నేను అంత దూరం వెళ్లి పింఛన్‌ ఎలా తెచ్చుకునేది..?. ఏ పుణ్యాత్ముడో ఫిర్యాదు చేసి నాలాంటి వారి ఉసురు పోసుకున్నాడు. పింఛన్‌ ఇంటికి రాకుండా చేశారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్‌ తెచ్చుకోవాలంటే నలుగురిని మంచంపై సచివాలయం వద్దకు మోసుకెళ్లాలి. అదే వలంటీర్‌ అయితే ఇంటివద్దకే వచ్చి ఇచ్చిపోయుండేవాడు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఏ దిగులూ లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంటికాడికి తెచ్చి ఇవ్వకపోయినా ఆయన చేసిన మేలు మరిచిపోతామా?.         
– గోవిందనాయుడు, కుప్పంబాదూరు గ్రామం, రామచంద్రాపురం 

టీడీపీ పాలనలో అష్టకష్టాలు..మళ్లీనా?
వాకాడు మండలం, ఇన్నమాల గ్రామానికి చెందిన పోలయ్య వయసు 91, చేను చెంగమ్మ వయసు 85, ఇన్నమాల సుబ్బమ్మ వయసు 86, బండి వెంకటసుబ్బయ్య వయసు 78. వీరి వలంటీర్లు ఉమ్మడి మోహన్, పీ.సులోచన, అఖిల కవిత. సోమవారం ఒకటో తేదీ కావడంతో వారి రాకకోసం ఎదురు చూశారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా నాయనా.. మీరు మాకు పింఛన్‌ ఇచ్చే వారా?.. అయితే నా పేరు ఫలానా.. నాకు పింఛన్‌ ఇవ్వండి’ అని అడిగి మరీ నిరాశ చెందారు. తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు వీ«ధి కాలవలపై కూర్చుని పింఛన్‌ కోసం ఎదురు చూసి నిట్టూర్పుతో వెనుదిరిగారు. చంద్రబాబు పుణ్యమా అంటూ మరో మూడు నెలలు పింఛన్‌ ఇంటికి రాదని సమాచారం తెలుసుకున్న అవ్వాతాతలు మాకు పింఛన్‌ రాకుండా చేసిన చంద్రబాబు, వారి మనుషులు మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు.  వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు  వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు

బాబు కుట్రలకు బలైపోయాం  
టీడీపీ హయాంలో పింఛన్‌ వచ్చే వరకు ప్రతిరోజూ అవస్థలే. ఎప్పుడు..? ఎక్కడిస్తారో తెలియని పరిస్థితి. పంచాయతీ, పోస్టల్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ కష్టాల నుంచి వృద్ధులను, వితంతువులను గట్టెక్కించారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ వలంటీర్‌ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్‌ ఇస్తున్నారు. అనారోగ్య కారణంతో మంచానికే పరిమితమైన నాలాంటి వారికి ఈ పద్ధతి ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్‌ తీసుకునే పరిస్థితులు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. నేను సచివాలయానికి వెళ్లాలంటే అద్దె ఆటో కావాలి. దానికి తోడు నా వెంట మరో వ్యక్తి సహాయం అవసరం. ఇంట్లో వారు సైతం పనులు మానుకుని నా వెంట రావాల్సిన పరిస్థితి. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే దాంట్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు. నాలాంటి వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. 
–మాచాలమ్మ, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం 

మేమంటే బాబుకు ఎందుకంత కక్ష
గతంలో వెయ్యి రూపాయల పింఛన్‌ కోసం మండుటెండల్లో కిలోమీటరు పొడవున ఉండే క్యూలో నిలబడేదాన్ని. నా మనవడు జగన్‌ వచ్చాక ఆ పరిస్థితి లేదు. నాకు ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారు జామున్నే మా వలంటీర్‌ సులోచన ఇంటికొచ్చి తలుపుతట్టి పింఛన్‌ ఇచ్చేది. ఈనెల ఒకటోతేదీ వచ్చినా మా వలంటీర్‌ ఇంటికి రాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గడపలో కూర్చుని ఎదురు చూశాను. ఎందుకు రాలేదని వేరే వాళ్లను అడిగితే చంద్రబాబు, వాళ్ల మనుషులు వలంటీర్లుపై కోర్టుకు వెళ్లి కేసు వేశారని చెప్పారు.  మరో మూడు నెలలు ఆఫీసుకాడికి వెళ్లి పింఛన్‌ తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు పోయే కాలం దగ్గరపడి పేదలను ఇలా కష్టాలు పెడుతున్నాడు. చంద్రబాబు అప్పుడు అలా చేశాడు.. ఇప్పుడు ఇలా అడ్డుకుంటున్నాడు. ఆయన పాలనలో ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని నాలుగో రోజున పింఛన్‌ ఇచ్చే వారు. ఇప్పుడు నా మనవడు జగన్‌ దయతో ఐదేళ్లు ఆ కష్టాలు తప్పినాయి. మళ్లీ చంద్రబాబు పాత రోజులను తీసుకురావడం దుర్మార్గం. 
చేను చెంగమ్మ వృద్ధురాలు, గొల్లపాళెం, వాకాడు మండలం 

మా ఉసురు తగలకుండా పోదు 
జగనన్న ప్రభుత్వ హయంలో మాకు తెల్లారేసరికి నిద్రలేపి పింఛన్‌ ఇచ్చారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1వ తేదీనే ఇంటికొచ్చి పింఛను ఇచ్చి, సమస్యలు అడిగి తెలుసుకునేవారు. జీతం తరహాలో పింఛను తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు మాకు అండగా నిలిచారు. వలంటీర్ల సేవలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడేమో ఎన్నికలు అని చెప్పి మాకు పింఛన్‌ అందకుండా చేశారు. పింఛన్‌ అడ్డుకున్న వాళ్లకు మాలాంటి ముసలోళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వం వలంటీర్ల ద్వారా మాకు మంచి చేస్తుంటే ఓర్వలేక అడ్డుపడడం బాధగా ఉంది. ఎవరో వద్దన్నారని వలంటీర్లు ఏమో ఈరోజు పింఛను ఇవ్వలేదు. ఎందుకని అడిగితే టీడీపీ వాళ్లు వలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వొద్దని అడ్డుకున్నారని తెలిసింది. ఇది మంచి పద్ధతేనా..?. మాలాంటి ముసలోళ్లకి మంచి జరిగితే ఓర్వలేరా..?. మాలాంటి వాళ్లపైన కక్షగడ్డి పింఛన్‌ రాకుండా చేశారు. మా ఉసురు తలగకుండా పోదు. 
– సరసమ్మ, ఎర్రమిట్ట, తిరుపతి  

Advertisement

తప్పక చదవండి

Advertisement