ఫిబ్రవరిలో సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

AP: Notification For The Recruitment Of Secretariat Jobs In February - Sakshi

దాదాపు 14,523 ఖాళీలు ఉన్నట్టు అంచనా 

మూడు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం

ఖాళీల వివరాలు పంపాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ లేఖ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ప్రాథమిక సమాచారం మేరకు.. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తోంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కేవలం నాలుగు నెలల్లోనే ప్రభుత్వం ముగించింది. అప్పట్లో మిగిలిన ఖాళీలకు 2020లో రెండో విడత నోటిఫికేషన్‌ ఇచ్చి పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి ఇప్పుడు మూడో విడత నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియను మొదలు పెట్టింది.   

ఏప్రిల్‌లోపు రాత పరీక్షలు పూర్తి చేసే అవకాశం.. 
ఈ ఏడాది ఏప్రిల్‌లోపే మూడో విడత నోటిఫికేషన్‌కు సంబంధించిన రాతపరీక్షలు కూడా నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలోనే రాతపరీక్షలతో సహా మొత్తం భర్తీ ప్రక్రియను చేపడతారు. ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ గత సోమవారం పంచాయతీరాజ్‌ శాఖకు లేఖ కూడా రాసింది. అలాగే ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొంది.

ప్రస్తుతం ఎనర్జీ అసిస్టెంట్‌ సహా మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపల్, వ్యవసాయ, పశు సంవర్ధక, సాంఘిక సంక్షేమ, ఉద్యానవన, సెరికల్చర్, ఫిషరీస్, వైద్య, ఆరోగ్య, హోం శాఖల పర్యవేక్షణలో ఆయా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ కూడా కేటగిరీల వారీగా ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలను మరోసారి పరిశీలించుకునేందుకు ఆయా శాఖల విభాగాధిపతుల నుంచి సమాచారం వేరుగా తెప్పించుకుంటోంది. మొత్తం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top