సానుకూలంగానే మున్సిపల్ కార్మికులతో చర్చలు: మంత్రి ఆదిమూలపు | AP Minister Audimulapu Suresh Reacts On Municipal workers Meeting | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కార్మికులతో సానుకూలంగానే చర్చలు.. ప్రజారోగ్యం కోసం విరమించాలని మంత్రి ఆదిమూలపు పిలుపు

Jan 2 2024 8:54 PM | Updated on Jan 2 2024 8:54 PM

AP Minister Audimulapu Suresh Reacts On Municipal workers Meeting - Sakshi

మున్సిపల్‌ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ.. సానుకూలంగానే జరిగినట్లు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

గుంటూరు, సాక్షి: పారిశుధ్య కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు ముగిశాయి. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ.. సానుకూలంగానే జరిగినట్లు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పలు డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని పేర్కొంటూ.. చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించారు.  

‘‘కార్మికుల డిమాండ్‌ మేరకు హెల్త్‌ అలవెన్స్‌ రూ.6 వేలు ఇచ్చాం. ఎక్స్‌గ్రేషియాపై సానుకూలంగా స్పందించాం. సమానపనికి సమాన వేతనంపై చర్చించాం. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చాం. దాని మేరకే చర్యలు తీసుకున్నాం. ఇవాళ్టి చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నాం. మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో ఇతర సమస్యలపైనా చర్చిస్తాం’’ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. 

ఇదిలా ఉంటే.. పారిశుద్ధ్య సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఝ చర్చలు జరిపింది. మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.  పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనటువంటి కేటగిరీల వారీగా బేసిక్ ఫే నిర్ణయం, పొరుగు సేవల విధానాన్ని కాంట్రాక్టు & శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఝ చర్చలు జరిగాయి. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పై పనిచేసే పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి  అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం,  ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, అవసరానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం, కాంట్రాక్టు విదానంలో ఘన వ్యర్థాలను తరలించే వాహనాల పనితీరును మెరగుపర్చడం, పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల నిర్వహించే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం తదితర అంశాలపై కూడా సుదీర్ఝ చర్చలు జరిగాయి. 
 
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్ర శేఖర రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ,  సిడిఎంఎ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్రకార్పొరేషన్ విసి & ఎండి గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండి వాసుదేవ రావు తదితర అధికారులతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు  ఆనంద్ రావు (YSRTUC రాష్ట్ర ప్రెసిడెంట్),  వై.వి.రమణ (YSRTUC ప్రధాన      కార్యదర్శి),  ఎ. రంగనాయకులు (AITUC రాష్ట్ర అధ్యక్షులు),  పి. సుబ్బారాయుడు (AITUC ప్రధాన కార్యదర్శి), అబ్రహం లింకన్ (IFTU ప్రెసిడెంట్), జి. ప్రసాద్ (APCITU  ప్రెసిడెంట్), కె. ఉమామహేశ్వరరావు (AP CITU ప్రధాన కార్యదర్శి), జి.రఘురామరాజు (TNTUC రాష్ట్ర ప్రెసిడెంట్),  శ్యామ్ (TNTUC ప్రధాన కార్యదర్శి), మధుబాబు (AP MEWU రాష్ట్ర       ప్రెసిడెంట్),  అంజినీయులు (AP MEWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), GVRKH వరప్రసాద్ (AICTU రాష్ట్ర అధ్యక్షులు),  కె. శ్రీనివాసరావు (AICTU జనరల్ సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement