పీఆర్సీ కమిషన్‌ను కూడా ఇప్పటివరకు నియమించలేదు
పెన్షనర్లకు డీఏ బకాయిలు రావడం లేదు
ఉద్యోగులకు రూ.7 వేల కోట్లు సరెండర్ లీవుల బకాయిలు ఇవ్వాలి
ప్రభుత్వోద్యోగుల సమస్యలపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య ధోరణి
జూలై 12న శ్రీకాకుళంలో.. 21న అనంతపురంలో.. ఆ తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉద్యమ సన్నద్ధ సభలు
అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఐక్య ఉద్యమ కార్యాచరణ
పని ఒత్తిడి కారణంగా ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించలేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బకాయిలు చెల్లిస్తారని ఉద్యోగులంతా ఆశించారని.. కానీ, ప్రభుత్వం ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఇవ్వాలో చెప్పాలని కోరినా కనీస స్పందనలేదని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ఆయన, ఆ జిల్లా ఏపీ జేఏసీ అమరావతి యూనిట్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా యూనియన్ నాయకులు సోమవారం కలెక్టరేట్‌లో ఆమెను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
అనంతరం అక్కడ మీడియాతో బొప్పరాజు మాట్లాడారు. ఆరు నెలలకోసారి పెరగాల్సిన డీఏను రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. అలాగే, పీఆర్సీ కమిషన్‌ను కూడా ఇప్పటివరకు నియమించలేదన్నారు. అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ ఆ ఊసేలేదన్నారు. ఏడు వేల కోట్ల రూపాయల సరెండర్ లీవుల బకాయిలను ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందని బొప్పరాజు చెప్పారు. ఇవి ఇవ్వకపోవడంవల్ల పోలీసులు సహా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలు రావడంలేదని, దీంతో వారి పరిస్థితి దుర్భరంగా ఉందని తెలిపారు. సమాన పనిచేస్తున్నా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన వేతనంలేదని, వారిని క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకూ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకంతో ఉద్యోగులు రెండేళ్లుగా ఎంతో సహనంతో ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడం సరికాదన్నారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యలపట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు.
ఇదీ మా ఉద్యమ కార్యాచరణ..
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాల, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. జూలై 12న శ్రీకాకుళంలో, జూలై 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధత సభలు నిర్వహించాక అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ సభలను ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కలిసివచ్చే ఇతర సంఘాలతో కలిసి ప్రత్యక్ష ఐక్య ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
రెవెన్యూ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఏ సమస్య వచ్చినా అసోసియేషన్ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, డీవీ ఫణి పేర్రాజు మాట్లాడుతూ.. తమకు రావలసిన ఆరి్థక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


