చంద్రబాబు సర్కారుపై సమరానికి సన్నద్ధం | AP JAC Amaravati Chairman Bopparaju lashes out at the government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారుపై సమరానికి సన్నద్ధం

Jun 18 2026 4:31 AM | Updated on Jun 18 2026 4:31 AM

AP JAC Amaravati Chairman Bopparaju lashes out at the government

రెండేళ్లుగా పీఆర్సీ లేదు.. ఐఆర్‌ ఇవ్వరు.. డీఏ ఊసెత్తడం లేదు

ఉద్యోగులకు రూ.30 వేల కోట్ల బకాయిలివ్వాలి 

బెనిఫిట్స్‌ ఇవ్వకుండా ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలను చంద్రబాబు నాశనం చేస్తున్నారు 

చిన్న ఉద్యోగులందరూ అప్పుల పాలవుతున్నారు

ప్రభుత్వ కార్యాలయాల్లో పరికరాలకూ ఉద్యోగులే ఖర్చు పెట్టాల్సి వస్తోంది

ర్యాంక్‌ల కోసం ఉద్యోగుల మెడపై కత్తి పెట్టిన కలెక్టర్లు.. ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటు, ఆత్మహత్యల పాలవుతున్న ఉద్యోగులు 

ఉద్యోగుల బాధలు తెలుసన్న డిప్యూటీ సీఎం పవన్‌ సమాధానం చెప్పాలి

ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు 

ఉద్యోగులపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ఫణి పేర్రాజు మండిపాటు 

వాస్తవాలను ప్రజల ముందుంచుతామని వెల్లడి  

నెల్లూరు (అర్బన్‌): ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని రెండేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాం. ప్రభుత్వంతో చర్చించాం. అయినా ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా పీఆర్సీ లేదు.. ఐఆర్‌ ఇవ్వరు.. డీఏ ఊసెత్తడం లేదు. అందుకే ప్రభుత్వంతో పోరాటానికి సన్నద్ధంగా ఉన్నాం. పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం’ అని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించి పోరాటాన్ని ప్రారంభించేందుకు బొప్పరాజు బుధవారం నెల్లూరులో జేఏసీ భాగస్వాములైన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశంలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం కనీసం చైర్మన్‌ను కూడా నియమించలేదని బొప్పరాజు మండిపడ్డారు. ఐదు డీఏలు ఇవాల్సి ఉందని, వాటి పైనా మాట్లాడడం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మంచి ఐఆర్‌ ఇస్తామని చెప్పిన చంద్రబాబు కూటమి.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదఅన్నారు. తెలంగాణలో మధ్యంతర భృతి (ఐఆర్‌) తీసుకుంటుంటే, ఏపీలో జీతాలకే పరిమితం కావాల్సి వచ్చిందని అన్నారు. మరోపక్క ఆర్జిత సెలవుల నగదు, డీఏలు, ఇతరత్రా రూ.30 వేల కోట్ల బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. 

వీటిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఉద్యోగులు నిజాయితీగా ట్యాక్స్‌ కడుతున్నారని, సంవత్సరం పనిచేస్తే.. 9 నుంచి 10 నెలల జీతాలు మాత్రమే తీసుకుంటారని, మిగతా నగదును ప్రభుత్వమే ట్యాక్స్‌ రూపంలో కట్‌ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, ఆస్పత్రుల ఖర్చులు, ఈఎంఐ, ఎల్‌ఐసీ వంటి సేవింగ్స్‌కు ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్యోగులు ఖర్చు చేస్తారన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌ ఇవ్వకపోవడంతో ఆ ప్రణాళిక సర్వనాశనమైందన్నారు. చిన్న ఉద్యోగులందరూ అప్పుల పాలవుతున్నారన్నారు. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వ శాఖలకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌ విడుదల చేయకపోవడంతో కార్యాలయాల్లో పరికరాలకు ఉద్యోగుల జేబుల్లో నుంచే ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలిపారు.

ప్రభుత్వ ఒత్తిడి వల్లే గుండెపోటు, ఆత్మహత్యలు 
ప్రభుత్వం కలెక్టర్లకు ర్యాంక్‌లు ఇస్తుందని, ఆ ర్యాంకుల కోసం కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు రెండు, మూడు రకాల పనులు ఒకే దఫా అప్పగిస్తున్నారన్నారు. ఇద్దరు, ముగ్గురు చేయాల్సిన పనిని ఒక ఉద్యోగి మెడపై కత్తి పెట్టి చేయిస్తున్నారని, కాస్త ఆలస్యం జరిగినా టార్చర్‌ పెడుతున్నారని చెప్పారు. దీంతో ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురై పలువురు గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారని, మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.

తప్పని పరిస్థితుల్లోనే పోరాటాలు
ఉద్యమాలు తమకు సరదా కాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పోరాటానికి పూనుకున్నామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఈ విషయాలను అందరి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఏపీ ఎన్‌జీఓ సంఘం నాయకులను సంప్రదించి ఐక్య పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చామని చెప్పారు. తన తండ్రి కూడా ఓ పోలీసు ఉద్యోగేనని, ఉద్యోగుల బాధలు తెలుసని మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ఉద్యోగుల బాధలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఖజానా ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని కొంత మంది పెయిడ్‌ ఆర్టిస్టులతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని, ఆ లెక్కలు కూడా తేలుస్తామని చెప్పారు.  

యూపీ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులకు బోనస్‌లు
ఉద్యమ కార్యాచరణ రాష్ట్ర కమిటీ చైర్మన్‌ ఫణి పేర్రాజు మాట్లాడుతూ యూపీ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులకు బోనస్‌ ఇస్తున్నారని, తాము బోనస్‌లు అడగడంలేదని, న్యాయపరంగా రావాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఉద్యోగులతో చర్చించి పీఆర్సీ, ఇతర సమస్యలు పరిష్కరించి, బకాయిలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు. సమావేశంలో ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ అల్లంపాటి పెంచలరెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement