సాక్షి, అమరావతి: ఇంటర్మిడియట్ విద్యకు సంబంధించి 2026–27 విద్యా సంవత్సరంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. సెకండియర్ విద్యార్థులకు కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. మొత్తం 14 ప్రధాన సబ్జెక్టుల్లో సవరించిన కొత్త సిలబస్‌ను ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. అలాగే గత విద్యా సంవత్సరం ఇంటర్ మొదటి ఏడాదిలో కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు అప్‌డేటెడ్ సిలబస్‌ను అమల్లోకి తేనున్నారు.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, జియోగ్రఫీ వంటి మైనర్ సబ్జెక్టుల సిలబస్‌ను కూడా సవరించారు. ఇప్పటికే కొత్త సిలబస్‌కు అనుగుణంగా క్వశ్చన్ పేపర్ డిజైన్లు, మోడల్ పేపర్లను ఇంటర్ విద్యా శాఖ ఖరారు చేసింది. కాగా, ఈనెల 12 నుంచి కాలేజీలు తెరుచుకోనున్న నేపథ్యంలో ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా గురువారం ఆర్జేడీలతో పాటు జిల్లాల అధికారులు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి విద్యార్థుల పెండింగ్ వివరాలను అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కాలేజీల్లో 10% అడ్మిషన్ల పెంపు చేపట్టాలన్నారు. కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ సర్వీస్ పునరుద్ధరణ పూర్తిగా వారు బోధించే సబ్జెక్టుల్లో పబ్లిక్ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగానే ఉంటుందన్నారు.


