
మొన్న ఈఏపీసెట్, ఐసెట్ కౌన్సెలింగ్‌లో గందరగోళం
తాజాగా ఎం.ఫార్మసీ కౌన్సెలింగ్ తాత్కాలికంగా వాయిదా
ఇంజినీరింగ్ రెండో ఏడాది తరగతులు ప్రారంభమయ్యాక కౌన్సెలింగ్‌కు షెడ్యూల్
ఏడీసెట్‌కు నోటిఫికేషన్ ఇచ్చినా తరగతుల నిర్వహణపై అనుమానాలే?
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాశాఖ అడ్మిషన్ల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించినా.. దాని ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించలేకపోతోంది. ప్రభుత్వం నుంచి కళాశాలలకు అఫిలియేషన్, ఫీజులు, ఇన్‌టేక్‌కు అనుమతిస్తూ రావాల్సిన జీవోలు అలస్యం కావడంతో ఈఏపీసెట్, ఐసెట్ కౌన్సెలింగ్ తేదీలను మార్చుకోవాల్సి వచ్చింది. తాజాగా పీజీఈసెట్ కౌన్సెలింగ్ వేళ ఏకంగా ఎం.ఫార్మసీ ప్రవేశాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పదేపదే ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడుతుండటంతో లక్షలాది విద్యార్థులను తీవ్ర గందరగోళంలోకి నెడుతోంది.
ఐసెట్‌లో ఇలా
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్‌ను కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి రిజిస్ట్రేషన్లు, 13 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 17న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఇచ్చారు. అయితే, 15వ రాత్రి వరకు కళాశాలలకు అనుమతుల జీవోల కోసం ఉన్నత విద్యామండలి అధికారులు ఎదురు చూశారు. ఎప్పుడో అర్ధరాత్రి రావడంతో తేదీలు మార్చి ఈ నెల 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లుకు అవకాశం ఇచ్చారు.
ఎం.ఫార్మసీకి బ్రేక్
పీజీఈసెట్‌లో భాగంగా ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ నెల 17న రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. 19 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. అయితే, ఇప్పుడు రాష్ట్రంలోని 20కిపైగా ఎం.ఫార్మసీ కళాశాలలకు ఫార్మసీ కౌన్సిల్ నుంచి అనుమతులు రాకపోవడంతో ఎం.ఫార్మసీ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది.
ఏడీసెట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఏదీ?
పేదింటి బిడ్డలు ఆర్కిటెక్చర్ రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని స్థాపించింది. గతంలో అన్ని సెట్స్ మాదిరిగానే ఆర్కిటెక్చర్ ప్రవేశాలకు కూడా ఏడీసెట్‌కు కన్వీనర్‌ను నియమించి నోటిఫికేషన్ ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏడీ సెట్ కన్వీనర్‌ను నియమించలేదు.
మంత్రికి తీరిక లేకపోవడం వల్లే?
ఏపీలో కళాశాలలకు అఫిలియేషన్లను యూనివర్సిటీలు మంజూరు చేస్తాయి. ఫీజులను ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయిస్తుంది. వీటిని అనుసరించి కళాశాలల ఇన్‌టేక్, ఫీజులు, ఇతర అనుమతుల జీవోలను ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఉత్తర్వులు ఉన్నత విద్యాశాఖ నుంచి విద్యాశాఖ మంత్రి లాగిన్‌కు వెళ్లి, అక్కడ అనుమతి పొంది, తిరిగి ఉన్నత విద్యశాఖ ద్వారా జీవో విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇతర పనుల్లో బిజీగా ఉండే మంత్రి లోకేశ్‌కు ఈ ఫైళ్లు చూసేంత తీరిక ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది.
ఈఏపీసెట్‌లో అలా
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 7నుంచి రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ సాంకేతిక విద్యామండలి షెడ్యూల్ ఇచ్చింది. ఇందులో కేవలం ఎంపీసీ స్ట్రీమ్‌కు మాత్రమే కౌన్సెలింగ్ చేపట్టారు. ఈ నెల 13నుంచి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చింది. అయితే, ఆ సమయానికి కళాశాలలకు అఫిలియేషన్, ఫీజులు, ఇన్‌టేక్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి జీవోలు రాలేదు. ఫలితంగా ఒక రోజంతా ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పటికీ ఈఏపీసెట్‌లో బైపీసీ స్ట్రీమ్‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది.