చంద్రబాబు – నారాయణపై విచారణకు బ్రేక్‌ 4 వారాలు ‘స్టే’

AP High Court imposed a temporary stay on Chandrababu and Narayana Trial - Sakshi

అసైన్డ్‌ భూముల కేసులో వారిద్దరిపై సీఐడీ విచారణతోపాటు 

తదుపరి చర్యలు నిలుపుదల

కౌంటర్లు దాఖలు చేయాలని సీఐడీ, ఆళ్లకు హైకోర్టు ఆదేశం

విచారణ ఏప్రిల్‌ 16కి వాయిదా

అసైన్డ్‌ భూముల బదలాయింపుల్లో అక్రమాలు జరిగాయి

70 ఎకరాలు తీసుకుని కావాల్సిన వారికి 105 ఎకరాల్లో ప్లాట్లు 

న్యాయస్థానానికి నివేదించిన అదనపు ఏజీ జాస్తి నాగభూషణ్‌

సీఆర్‌డీఏ చట్టంలో ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉందిగా?

కోర్టుకు సంతృప్తికర వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశం 

సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి అసైన్డ్‌ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో విచారణతో పాటు తదుపరి చర్యలపై హైకోర్టు తాత్కాలికంగా ‘స్టే’ విధించింది. సీఆర్‌డీఏ చట్టం కింద చేపట్టిన చర్యల విషయంలో ప్రభుత్వం, అధికారులు, అథారిటీలకు వ్యతిరేకంగా ఎలాంటి సూట్‌ దాఖలు చేయడం గానీ, ప్రాసిక్యూట్‌ చేయడంగానీ చేయరాదంటూ సీఆర్‌డీఏ చట్టం సెక్షన్‌ 146లో నిషేధం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణార్హతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయంది.

ఈ ప్రశ్నలను తేల్చేంత వరకు, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆధారాలను బట్టి చంద్రబాబు, నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నాలుగు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు తెలిపింది. ప్రాసిక్యూషన్‌పై సెక్షన్‌ 146 నిషేధం విధిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సీఐడీ, ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డిని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 16వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా సీఐడీ తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో వేర్వేరుగా క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జాస్తి నాగభూషణ్‌ వాదనలను వినిపించారు.

కక్ష సాధింపులో భాగం..
ప్రభుత్వ పెద్దలు వరుసగా పిటిషనర్లపై దాడులు చేస్తున్నారని, ఇప్పుడు సీఐడీతో కేసులు నమోదు చేయించారని సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి వాదనలు వినిపించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో చంద్రబాబుపై ఒక కేసు (ఓటుకు కోట్లు) వేశారని, అది సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదైందన్నారు. రాజధాని భూ సమీకరణలో అసైన్డ్‌ భూములను చేరుస్తూ జారీ చేసిన జీవో 41 విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకే జీవో జారీ అయిందన్నారు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉందన్నారు.  

చంద్రబాబు నుంచి ఆదేశాలు..
అసైన్డ్‌ భూములను భూ సమీకరణలో భాగం చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకోకముందే నిర్ణయించారని అదనపు ఏజీ నాగభూషణ్‌ న్యాయస్థానానికి నివేదించారు. టీడీపీ వారికి లబ్ధి చేకూర్చాలనే ఇలా చేశారని వివరించారు. గుంటూరు జిల్లా నవులూరులో 70 ఎకరాల అసైన్డ్‌ భూమి తీసుకుని ప్లాట్ల పంపిణీని మాత్రం 105 ఎకరాల మేర చేశారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. వారికి కావాల్సిన వారికి మరో 35 ఎకరాల మేర లబ్ధి చేకూర్చారన్నారు. మిగిలిన చోట్ల కూడా ఇలాగే జరిగిందన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారన్నారు. అప్పటి తహసీల్దార్‌ అన్నే సుధీర్‌బాబు పాత్రపై విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. అసైన్డ్‌ భూముల బదలాయింపులో చంద్రబాబు, నారాయణలకు సంబంధం ఉందని, వారి ఆదేశాల మేరకే జీవో 41 జారీ అయిందన్నారు. ఇదే విషయాన్ని రూఢీ చేస్తూ అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారని నివేదించారు. ఈ వ్యవహారానికి సంబంధించి నోట్‌ ఫైళ్లు, అడ్వొకేట్‌ జనరల్‌ సలహాలు లేవన్నారు. జీవో 41 వల్ల అసైనీలు మాత్రమే కాకుండా సీఆర్‌డీఏ, ప్రభుత్వం కూడా నష్టపోయిందన్నారు. 

సదుద్దేశ చర్యలకే సెక్షన్‌ 146 నిషేధం వర్తిస్తుంది...
ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్‌ రాయ్‌ స్పందిస్తూ.. సీఆర్‌ఏడీ చట్టం సెక్షన్‌ 146 కింద ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉంది కదా? అని ప్రశ్నించారు. దీనిపై ఏజీ నాగభూషణ్‌ సమాధానమిస్తూ సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలకే అది వర్తిస్తుందన్నారు. చంద్రబాబు, నారాయణ దురుద్దేశాలతో వ్యవహరించారని, కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చాలనే జీవో 41 తెచ్చారన్నారు. వాదనల అనంతరం ఈ కేసులో నాలుగు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అయితే విచారణపై స్టే కేవలం చంద్రబాబు, నారాయణకే వర్తిస్తుందా? లేక అధికారులతోపాటు ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారికి కూడా వర్తిస్తుందా? అని అదనపు ఏజీ భూషణ్‌ వివరణ కోరడంతో, ఈ కోర్టుకు చంద్రబాబు, నారాయణ మాత్రమే వచ్చారని, అందువల్ల ఈ ఉత్తర్వులు వారికి మాత్రమే వర్తిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top