
ఏపీలో అడ్డగోలుగా జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టులలో జరుగుతున్న ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ తరహా అరెస్టులు, రిమాండ్‌లను కట్టడి చేసే దిశగా అడుగులేసింది. ఒకవైపు ఏపీ జడ్జిలకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది.
సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు, రిమాండ్‌ల విధింపు విషయంలో జరుగుతున్న అడ్డగోలు ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ క్రమంలోనే ఏపీ జడ్జిలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ విధింపు విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది.
సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలతో ఈ ఏడాది కాలంలో ఏపీలో లెక్కలేనని అరెస్టులు జరిగాయి. అయితే.. ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను చాలావరకు జడ్జిలు పాటించడం లేదని ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. ఈ క్రమంలో న్యాయమూర్తులకు హైకోర్టు రిజిస్ట్రార్ తరఫున తాజాగా ప్రత్యేక సర్క్యులర్ జారీ చేయించింది.
‘‘సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా కొందరు జడ్జిలు రిమాండ్లు విధిస్తున్నారు. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది. రిమాండ్ విధించేటప్పుడు తప్పనిసరిగా సుప్రీం గైడ్‌లైన్స్ పాటించాలి. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి.
ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లు..
ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనల, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్‌లు పెట్టకూడదు.
డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి. రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా? లేదా? పరిశీలించాలి.
మొత్తం 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేయాలి.. అని తాజా సర్క్యులర్‌లో హైకోర్టు పేర్కొంది.
జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌లు ఖచ్చితంగా ఈ సర్క్యులర్ అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, సదరు మెజిస్ట్రేట్‌లు శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు.. ఇంతకు ముందు ఈ తరహా అరెస్టుల విషయంలో పోలీసుల తీరుపైనా ఉన్నత న్యాయస్థానం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.