కరోనా మృతుల పిల్లలకు ఏపీ సర్కార్‌ అండ | AP Govt Support For Children Who Lost Their Parents With Corona | Sakshi
Sakshi News home page

కరోనా మృతుల పిల్లలకు ఏపీ సర్కార్‌ అండ

Aug 14 2021 7:05 AM | Updated on Aug 14 2021 7:06 AM

AP Govt Support For Children Who Lost Their Parents With Corona - Sakshi

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రైవేటు స్కూల్‌లో.. ఎందులో చదువుతున్నా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటోంది.

సాక్షి, అమరావతి: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రైవేటు స్కూల్‌లో.. ఎందులో చదువుతున్నా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటోంది. 2020, 2021ల్లో కరోనాతో 6,800 మంది పిల్లలు తమ తల్లి లేదా తండ్రిని లేదా ఇద్దరినీ కోల్పోయారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. ఇలా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే చైల్డ్‌ ఇన్ఫో డేటా ప్రకారం గుర్తించాలని అన్ని విద్యా సంస్థలకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వల్ల అనాథలైన బాలబాలికలు ఏ పాఠశాలలో చదువుతున్నా అక్కడే వారు కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

ప్రైవేటు పాఠశాలల్లో వారికి ఇబ్బందులు ఎదురైతే ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద వారికి అక్కడే చదువు చెప్పించనుంది. అలాగే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎవరైనా బడి మానేసి ఉంటే.. వారిని కూడా గుర్తించి ఉచిత విద్య అందించనుంది. తల్లిదండ్రులను కోల్పోయిన 6,800 మంది పిల్లల్లో ఇప్పటివరకు 4,333 మంది పిల్లల పూర్తి వివరాలను అధికారులు సేకరించారు. ఈ పిల్లల్లో 1,659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో, 2,150 మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్నట్లుగా నిర్ధారించారు. మరో 524 మంది శిశువులుగా ఉన్నారని తేల్చారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. 

పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు ఇవే..
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల వివరాలను విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చైల్డ్‌ ఇన్ఫోలో వెంటనే నమోదు చేయాలి.
అటువంటి పిల్లలు ఏ పాఠశాలల్లో చదువుతుంటే అక్కడే కొనసాగేలా చూడాలి. 
ఫీజు చెల్లించలేదనే కారణంతో ప్రైవేటు విద్యా సంస్థలు ఆ విద్యార్థులను తొలగించరాదు. తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఆ పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేలా చూడాలి. అంతేకాకుండా జగనన్న విద్యా కానుక కింద వారికి మూడు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్‌ బ్యాగు, షూ, సాక్సులు, బెల్టు, డిక్షనరీలను మొదటి ప్రాధాన్యత కింద అందించాలి.
ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు తదితరాలను అందించేందుకు అయ్యే ఖర్చును విద్యా శాఖ భరించనుంది.
తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లల విషయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియచేయాలి.

ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు..
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులు నిరాటంకంగా కొనసాగేలా చూడాలని సుప్రీంకోర్టు ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వివరాలను తమకు నివేదించాలని ఆదేశించింది. అలాగే జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ కూడా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు పరిధిలోని జువైనల్‌ జస్టిస్‌ కమిటీ కూడా పాఠశాల విద్యా శాఖ, మహిళ, శిశు సంక్షేమ శాఖలతో ఇటీవల సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement