సొంతూళ్లలో సకల సౌకర్యాలు | AP Govt Planning Revolutionary Measures For Farmers | Sakshi
Sakshi News home page

సొంతూళ్లలో సకల సౌకర్యాలు

Jan 18 2021 3:38 AM | Updated on Jan 18 2021 12:45 PM

AP Govt Planning Revolutionary Measures For Farmers - Sakshi

సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగుకు అవసరమైన సమస్త సదుపాయాలను రైతుల సొంతూళ్లలోనే అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆర్బీకేల పరిధిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలపై భారీ ఎత్తున వ్యయం చేయాలని నిర్ణయించారు. రైతుల కోసం బహుళ ప్రయోజన కేంద్రాలు (మల్టీ పర్పస్‌ సెంటర్లు), డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ఏర్పాటుకు ఏకంగా రూ.12,425 కోట్లు వెచ్చిస్తున్నారు. బహుళ ప్రయోజన కేంద్రాలకు రూ.10,235 కోట్ల వ్యయం కానుందని ప్రాథమిక అంచనా. గోదాములు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాం (ధాన్యం ఆరబెట్టే స్థలం), కలెక్షన్‌ సెంటర్లు (ధాన్యం సేకరణ కేంద్రాలు), కోల్డు రూంలు.. శీతల గిడ్డంగులు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు (వ్యవసాయానికి సంబంధిన అధునాతన యంత్రాలను అద్దెకు ఇచ్చే కేంద్రాలు), ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు (ధాన్యాన్ని ప్రాథమికంగా శుద్ధి చేసే కేంద్రాలు), అసైయింగ్‌ ఎక్విప్‌మెంట్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ ఇన్‌ఫ్రా (ధాన్యం నాణ్యతను పరీక్షించే సామగ్రి), బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు (పాలను సేకరించాక నిల్వ ఉంచే కేంద్రాలు), ఆక్వా మౌలిక సదుపాయాలు, పశు సంవర్ధక మౌలిక సదుపాయాలు, సేకరణ కేంద్రాలు, జనతా బజార్లు, ఈ–మార్కెటింగ్‌  తదితర సదుపాయాలను వీటిల్లో కల్పిస్తారు. ఈ కేంద్రాల పనులను మార్చిలో ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

రూ.2,190.88 కోట్లతో 10,408 ఆర్బీకేల నిర్మాణం
రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాల కార్యకలాపాలు గ్రామాల్లో కొనసాగుతుండగా 10,408 ఆర్బీకేల భవన నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒక్కో భవనానికి రూ.21.05 లక్షల చొప్పున మొత్తం రూ.2,190.88 కోట్లు వ్యయం చేయనున్నారు. 445 ఆర్బీకే భవనాల నిర్మాణం పూర్తి కాగా, మరో 280 తుది దశకు చేరుకున్నాయి. 5,264 భవనాలు తొలి అంతస్తు శ్లాబు స్థాయిలో ఉన్నాయి. 4,356 భవనాలు బేస్‌మెంట్‌ స్థాయిలో ఉన్నాయి. మొత్తం ఆర్బీకేల భవన నిర్మాణాలను ఈ ఏడాది మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  

వచ్చే నెలలో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు
వచ్చే నెలలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను అన్ని ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేస్తాం. గన్నవరం కేంద్రంగా పనిచేసే ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ ద్వారా రైతులకు సాంకేతిక సలహాలు, సూచనలు ఇస్తున్నాం. పంటలకు మద్దతు ధర కోసం ఆర్బీకేలలో రైతు రిజిస్ట్రేషన్‌ను ఖరీఫ్‌ నుంచి ప్రారంభించాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్బీకే భవనాల నిర్మాణాన్ని మార్చి నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్‌ 

రైతు ముంగిట్లోకి సేవలు
విత్తనం నుంచి పంట విక్రయం వరకు గ్రామాల్లోనే రైతులకు అన్ని సేవలు అందించేలా సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనల మేరకు ఆర్బీకేలను తీర్చిదిద్దుతున్నారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందిస్తున్నారు. మేలైన యాజమాన్య పద్ధతులను వివరించేందుకు పొలంబడి, తోటబడి నిర్వహిస్తున్నారు. లైబ్రరీ, స్మార్ట్‌ టీవీల ద్వారా ఉత్తమ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. మట్టి నమూనాలు, విత్తన నాణ్యత పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచారు. గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులు పండించే పంటల వివరాలను ఇ– పంట ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ రికార్డు ఆధారంగా పంట ఇన్సూరెన్స్, పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీ రాయితీ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement