పారిశ్రామిక రంగం ఇక పరుగులే.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP Government Full Focus On Industrial Sector - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టేందుకు వీలుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. పరిశ్రమలు, పారిశ్రామిక మౌలిక వసతులు, ఐటీ, నైపుణ్యాభివృద్ధికి కలిపి రికార్డు స్థాయిలో రూ.5,081.41 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.4,779.1 కోట్లతో పోలిస్తే ఇది 6.32 శాతం అదనం. ఇందులో ఒక్క పారిశ్రామిక మౌలిక వసతులకే రూ.1,142.53 కోట్లు వ్యయం చేయనున్నారు. 

పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు, రెండు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ మారిటైం బోర్డు రూ.8,000 కోట్లు రుణం తీసుకోవడానికి కూడా అనుమతించారు. ఇందులో ఇప్పటికే రామాయపట్నం, భావనపాడు పోర్టు పనులకు టెండర్లు ఖరారు కాగా.. బందరు పోర్టుకు తాజాగా టెండర్లు పిలిచారు. అదే విధంగా విశాఖ వద్ద భోగాపురం, నెల్లూరు దగదర్తి వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇక పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన విద్యార్థులను అందించడానికి ఏకంగా రూ.969.91 కోట్లు వ్యయం చేయనున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు. పరిశ్రమల రంగానికి రూ.2,755.17 కోట్లు, ఐటీ రంగానికి రూ. 212.13 కోట్లు కేటాయించారు.

ఎంఎస్‌ఎంఈలకు రూ.450 కోట్లు
అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఈ బడ్జెట్‌లో రూ.450 కోట్లు కేటాయించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వైఎస్సార్‌ జగనన్న, వైఎస్సార్‌ బడుగు వికాసం కింద రాయితీలకు రూ.175 కోట్లు కేటాయించారు. ఐటీ రంగ కంపెనీల ప్రోత్సాహకాలకు రూ.60 కోట్లు, ఇతర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.411.62 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. ఏడీబీ నిధులతో అభివృద్ధి చేస్తున్న విశాఖ–చెన్నై కారిడార్‌లో వివిధ పనులకు రూ.611.86 కోట్లు కేటాయించారు. ఈ కారిడార్లో రహదారుల అభివృద్ధికి రూ.250 కోట్లు, ఏపీఐఐసీ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.236.86 కోట్లు, విద్యుత్‌ సదుపాయాల కోసం రూ.125 కోట్లు వ్యయం చేయనున్నారు.

ఎగుమతుల్లో ఏడు నుంచి నాలుగో స్థానానికి..
మరోవైపు.. 2019–20లో దేశ ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020–21 నాటికి 4వ ర్యాంకుకు చేరుకుందని, 16.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులను 2030 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్‌ నవోదయం కింద రూ.7,976 కోట్ల విలువైన ఎంఎస్‌ఎంఈ ఖాతాలను పునర్వ్యవస్థీకరణ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఏడాదిలో వెనుకబడిన, షెడ్యూల్‌ తరగతులకు చెందిన పరిశ్రమలకు రూ.671 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు.

వైఎస్సార్‌ ఈఎంసీ ప్రారంభం
ఐటీ, ఎలక్ట్రానిక్‌ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా కొప్పర్తిలో వైఎస్సార్‌ ఈఎంసీని సీఎం జగన్‌ గత ఏడాది డిసెంబర్‌ 23న ప్రారంభించారని బుగ్గన చెప్పారు. ఇప్పటికే ఇక్కడ రూ.660 కోట్లతో 9,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. ఈ రంగంలో వచ్చే మూడేళ్లలో రూ.4,000 కోట్ల పెట్టుబడితో 25,000 మందికి ఉపాధి కల్పించే కంపెనీలు రానున్నాయన్నారు. పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తన తాజా బడ్జెట్‌లో ఇలా భారీ కేటాయింపులు చేయడంపై పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. 

రాష్ట్రానికి భారీ పరిశ్రమలు
రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని బుగ్గన రాజేంద్రనాథ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ 31 నాటికి రాష్ట్రంలో 7,107 ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ద్వారా రూ.2,099 కోట్ల పెట్టుబడులతో పాటు 46,811 మందికి ఉపాధి లభించిందన్నారు. అలాగే, జనవరి 31, 2022 నాటికి 11 మెగా ప్రాజెక్టులు ఏర్పాటుకావడం ద్వారా 3,989 మందికి ఉపాధి లభించినట్లు తెలిపారు. మరో 55 భారీ ప్రాజెక్టులు రూ.44,097 కోట్ల పెట్టుబడులను పెట్టడానికి ముందుకొస్తున్నాయన్నారు. వీటిద్వారా 93,116 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.  

ఆర్థిక వృద్ధికి దోహదం చేసే బడ్జెట్‌
రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విధంగా పలు అభివృద్ధి పథకాలను ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్ర వృద్ధిలో కీలకమైన ఎంఎస్‌ఎంఈ రంగానికి పెద్దపీట వేయడంతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు, కర్నూలులో ఎయిర్‌పోర్టు సిటీ, రూ.6,400 కోట్లతో జిల్లా–మండల రహదారుల అనుసంధానం వంటి ప్రాజెక్టులను సీఐఐ స్వాగతిస్తోంది. రైతులకు వ్యవసాయ యంత్రాలను అద్దెకిచ్చే విధంగా రైతు భరోసా కేంద్రాల వద్ద 10,750 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ నిర్ణయం.                                     - నీరజ్‌ శరద, -చైర్మన్, సీఐఐ, ఏపీ చాప్టర్‌ 

గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పరిశ్రమల రంగానికి రూ.2,755.17 కోట్లు, విద్యుత్‌ రంగానికి రూ.10,000 కోట్లు కేటాయించడాన్ని ఆహ్వానిస్తున్నాం. కోవిడ్‌ సంక్షోభం నుంచి త్వరగా కోలుకునే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి.
   - సీవీ అచ్యుతరావు, అధ్యక్షుడు, ఫ్యాప్సీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top