కౌలుదారులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
సంక్షేమ పథకాలు వట్టిమాటేనని ఆవేదన
రుణాలు దక్కక, బీమా అందక గగ్గోలు
కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆందోళన
ఆదుకోని కొనుగోలు కేంద్రాలు సీసీఆర్సీ కార్డుల జారీ వట్టి బూటకమే
అన్నివిధాలా మోసపోతున్నామని కౌలు రైతుల ఆవేదన
ఏపీ కౌలు రైతుల సంఘం, పీపుల్స్ పల్స్ సంయుక్త సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ పాలనలో అన్నివిధాలుగా మోసపోయామని కౌలు రైతులు వాపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఏపీ కౌలు రైతుల సంఘం, పీపుల్స్ పల్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 నుంచి నెల రోజులపాటు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సర్వే జరిపారు. సర్వే ఫలితాలను రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు ఎ.కాటమయ్య, ప్రధాన కార్యదర్శి పి.జములయ్య సోమవారం మీడియాకు విడుదల చేశారు. 40 ప్రశ్నల ద్వారా కౌలు రైతుల నుంచి రాబట్టిన సమాధానాలను క్రోఢీకరించి తుది సర్వే నివేదిక రూపొందించినట్టు వెల్లడించారు. కౌలు రైతుల దయనీయ పరిస్థితికి ఈ సర్వే అద్దం పడుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకం దూరం కావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని కౌలు రైతులు తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల సంక్షేమ ఫలాలు ఏ ఒక్క కౌలు రైతుకు అందడం లేదనే విషయాన్ని కుండబద్దలు గొట్టారు.
సర్వేలో ఏం తేలిందంటే..
స్వచ్ఛంద నమోదు పద్ధతిన కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకం పుణ్యమా అని గడచిన 17 నెలల్లో ప్రీమియం భారమై పంటల బీమా రక్షణ కోల్పోయామని 99.1 శాతం మంది కౌలు రైతులు సర్వేలో స్పష్టం చేశారు. మద్దతు ధర దక్కడం లేదని 96.2 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ–పంటలో నమోదు చేయకపోవడం వల్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 14.3 శాతానికి మించి పంట ఉత్పత్తులను కౌలు రైతులు అమ్ముకోలేకపోతున్నారని సర్వేలో తేలింది.
మాట ఒప్పందంతోనే కౌలు
ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కౌలు రైతులు ఉంటారని అంచనా. వారిలో 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నట్టు సర్వేలో నిర్ధారించారు. 92.3 శాతం మంది కౌలు రైతులు మాట ఒప్పందం ద్వారానే భూముల్ని కౌలుకు తీసుకుంటున్నారు. 3.9 శాతం మంది రాతపూర్వక ఒప్పందం చేసుకోగా.. రెవెన్యూ రికార్డుల ద్వారా 2.6 శాతం మంది కౌలు ఒప్పందాలు చేసుకున్నారు. నగదు రూపంలో ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు లేదా ఎకరాకు 10 నుంచి 30 బస్తాల వరకు చెల్లిస్తున్నారు.
96.6 శాతం మందికి అందని ఫలాలు
87.7 శాతం మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులకు నోచుకోలేకపోతున్నారని సర్వేలో తేలింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని 96.6 శాతం మంది కౌలు రైతులు తేలి్చచెప్పారు. పంట పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందలేకపోతున్నామని 92.7 శాతం మంది స్పష్టం చేశారు. పెట్టుబడి కోసం ఏటా పంటను బట్టి 65 శాతం మంది రూ.60 వేల వరకు, 34.3 శాతం మంది రూ.60 వేలకు పైగా అప్పులు చేస్తున్నారు. వీటికోసం 38 శాతం మంది వడ్డీ వ్యాపారులను, 28.8 శాతం మంది వ్యాపారులు/దళారులను, 12.7 శాతం మంది భూ యజమానులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. తీసుకునే రుణంపై 79 శాతం మంది నూటికి రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తుండగా.. మిగిలిన వారు రూ.2 నుంచి రూ.5 వరకు చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. అదనుకు విత్తనాలు, ఎరువులు దొరకడం లేదని, పురుగు మందులు, కూలిరేట్లు, యంత్రాల అద్దెల భారం వల్ల ఆరి్థక ఇబ్బందులకు గురవుతున్నామని 67.2 శాతం మంది వాపోయారు.
91.4 శాతం మందికి ఈ–పంట దూరం
వాస్తవ సాగుదారుల పంట వివరాలను మాత్రమే నమోదు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే.. తాము పండించిన పంటల వివరాలను ఈ–పంట యాప్‌లో నమోదు చేయడం లేదని 91.4 శాతం మంది కౌలు రైతులు ఈ సర్వేలో తేల్చి చెప్పారు. ఫలితంగా పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేక దళారులు, ప్రైవేటు వ్యాపారులకు అయినకాడికి తెగనమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రైవేటు మార్కెట్‌లో 79.5 శాతం మంది, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 14.3 శాతం, దళారులకు 6.2 శాతం మంది అమ్ముకుంటున్నట్టుగా వెల్లడించారు.
సగటున రూ.5 లక్షల అప్పు
ఒక పంట సాగుచేస్తే ఏటా రూ.25 వేలపైన ఆదాయం వస్తోందని 28.1 శాతం, లాభం లేదు, నష్టం లేదని 19.4 శాతం మంది వెల్లడించగా.. నష్టం వస్తోందని 15.4 శాతం మంది కౌలు రైతులు తెలిపారు. దాంట్లో కూలీలకే దాదాపు 69.8 శాతం ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం మీకు ఎంత అప్పు ఉందని ప్రశ్నిస్తే రూ.5 లక్షలపైన ఉందని 20.4 శాతం మంది చెప్పగా.. మిగిలిన వారు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల మధ్య ఉన్నట్టుగా చెప్పారు. తాము ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం మంది, సకాలంలో గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం మంది, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం మంది, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం మంది, రుణమాఫీ చేయాలని 10.5 శాతం మంది కోరారు.
పంటల బీమాకు దూరమైన కౌలు రైతులు 99.1%
సంక్షేమ పథకాలు అందని వారు 96.6%
మద్దతు ధర దక్కని కౌలుదారులు 96.2%
పంట రుణాలు దక్కని వారు 92.7%
సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకడం లేదన్న వారు 67.2%
సీసీఆర్సీ కార్డులు అందని వారి శాతం 87.7%
కొనుగోలు కేంద్రాల్లో పంటల్ని విక్రయించే వారు 14.3%


