
పాసు పుస్తకాలతో క్యూలైన్లలో రోజంతా అగచాట్లు
ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆగ్రహావేశాలు
పోలీసుల పహారాలో అరకొరగా యూరియా పంపిణీ
ఒడిశా వెళ్లి తెచ్చుకుంటున్న గిరిజన రైతులు
సాక్షి నెట్‌వర్క్: వన్ బీ, ఆధార్, పాసు పుస్తకాలను క్యూలైన్లలో పెట్టి అన్నదాతల పడిగాపులు.. స్లిప్పుల కోసం ఆరాటం.. పొలం పనులు వదిలేసి కార్యాలయాల వద్ద అగచాట్లు.. బస్తాపై అదనంగా బాదుడు.. కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని మెలిక.. పోలీసు పహారా నడుమ అరకొరగా పంపిణీ.. అజమాయిషీ అంతా అధికార పార్టీ నేతల చేతుల్లోనే.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అన్నదాతల ఆగ్రహావేశాలు.. భగ్గుమన్న నిరసనలు.. ! ఇదీ రాష్ట్రవ్యాప్తంగా యూరియా విక్రయ కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితి!! సోమవారం పలుచోట్ల మధ్యాహ్నానికే స్టాక్ అయిపోవడంతో అన్నదాతలు ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టారు.
ప్రభుత్వం అవసరం మేరకు సరఫరా చేయకుండా యూరియా ఎక్కువగా వాడరాదంటూ గ్రామ సభలు నిర్వహించడం ఏమిటని మండిపడుతున్నారు. పంటలకు యూరియా ఎంతో అవసరమైన ప్రస్తుత తరుణంలో అందుకు తగినట్లుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పది ఎకరాలు సాగు చేసే రైతుకు సైతం ఒక్కటంటే ఒక్కటే యూరియా బస్తా ఇస్తామనడం ఏం న్యాయమని నిలదీస్తున్నారు. రైతులను నిరక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. అరకులోయ తదితర ప్రాంతాల్లో గిరిజన రైతులైతే ఏకంగా ఒడిశా వెళ్లి మరీ యూరియాను అధిక ధరకు కొనుగోలు చేసి తెచ్చుకోవడం అన్నదాతల దుస్థితికి అద్దం పడుతోంది.
ఉమ్మడి విజయనగరం జిల్లా వీరఘట్టం మన గ్రోమోర్ సెంటర్ వద్ద ఉదయం 6 గంటల నుంచే స్లిప్పుల కోసం పురుషులు, మహిళా రైతులు పెద్ద ఎత్తున వన్‌బీలు, ఆధార్ కార్డులతో బారులు తీరారు. సచివాలయం తలుపులను బలవంతంగా మూసివేయడంతో వీరఘట్టం గ్రామానికి చెందిన కమ్మవలస సన్యాసిరావు చేతి వేళ్లకు గాయాలయ్యాయి. రైతులను నియంత్రించలేక అధికారులు చేతులెత్తేశారు. చివరకు ఒక్క బస్తా కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.
మొదటి దఫాకే దిక్కు లేదు..
రెండు ఎకరాలు సాగు చేస్తున్నా. మొదటి విడత యూరియా వేద్దామంటే ఏ సొసైటీలోనూ నిల్వ లేదని చెబుతున్నారు. ఎక్కువ డబ్బులు పెట్టి కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. – గుడాల సురేష్, రైతు, పెనుమర్రు, యలమంచిలి మండలం, ప.గోదావరి జిల్లా
రైతుల కష్టాలు పట్టవా..?
గతంలో ఎప్పుడూ యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు. బయట కొందామంటే అధిక ధరలు చెబుతున్నారు. ఇక్కడకు వస్తే దొరకడం లేదు. రైతులు ఎక్కడికి పోవాలి? – జల్లు తిరుపతిరావు, జల్లవానిపేట, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా
రోజుల తరబడి తిరుగుతున్నా
కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎరువుల ధరలు పెరిగిపోయాయి. యూరియా అందుబాటులో లేకుండా పోయింది. మొక్కజొన్న, టమాట సాగు చేశా. రెండు నెలలుగా యూరియా కోసం కళ్యాణదుర్గంలో నేను తిరగని ఎరువుల దుకాణం లేదు. – రవి, దొడగట్ట గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా
ఒక్క బస్తాతో ఏం చేసుకోవాలి?
పది ఎకరాలు సాగు చేస్తున్నా. నెల రోజులుగా యూరియా రాలేదు. ప్రస్తుతం వరి పంట పిలకలు వేస్తున్నాయి. ఈ తరుణంలో యూరియా వేయాలి. 10 బస్తాల యూరియా అవసరం కాగా ఒక్క బస్తాతో ఏం చేసుకోవాలి? – ఇంటి రమేష్, రైతు, వీకే రాయపురం, కాకినాడ జిల్లా
ఒడిశా వెళ్లి కొంటున్నాం
అరకులోయ, డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల వ్యాపారుల వద్ద యూరియా దొరకపోవడంతో ఒడిశా వెళ్లి 50 కిలోల బస్తా యూరియాకు రూ.600 చెల్లించి కొంత మంది రైతులతో కలిసి 40 బస్తాలు తెచ్చుకున్నాం. తప్పనిసరి పరిస్థితిలో బస్తాకు ఆటో కిరాయి రూ.100 చెల్లించాం. రైతులను నిర్లక్షం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. –పాంగి తిలక్, గిరిరైతు, గుంటసీమ గ్రామం, అరకు