
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళం కలెక్టరేట్‌ను ముట్టడించిన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు
రాత్రివేళ శ్రీకాకుళం కలెక్టరేట్‌ను ముట్టడించిన 400 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు.. తీవ్ర అవమానాలు, దుర్భాషలు ఎదుర్కొంటున్నామని ఆవేదన
టీడీపీ నేత మాట కాదన్నారని చంటి బిడ్డ ఉన్న ఉద్యోగికి దూరంగా డిప్యుటేషన్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎరువుల కోసం రైతులు ఆందోళన చేయడం చూశాం... కానీ, ఎరువుల కొరత కారణంగా తాము నరకం చూస్తున్నామంటూ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ) ఏకంగా కలెక్టరేట్‌ను ముట్టడించారు. అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో కావడం గమనార్హం. గురువారం పగటి వేళ విధులు నిర్వహించిన వీరు... రాత్రి కలెక్టరేట్‌కు వచ్చి ఆందోళన చేశారు. రాత్రి 10 దాటే వరకు నిరసన కొనసాగగా.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వారితో చర్చలు జరిపారు. కాగా, అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు రణస్థలం వరకు, అటు భామిని నుంచి ఇటు శ్రీకాకుళం వరకు జిల్లావ్యాప్తంగా 400 మంది వ్యవసాయ, ఉద్యాన సహాయకులు తరలివచ్చారు.
వీరిలో సగంపైగా మహిళా ఉద్యోగులే. ‘‘నరసన్నపేటలో ఓ టీడీపీ నేత డబ్బులివ్వకుండా 50 బస్తాలు పక్కనపెట్టాలని డిమాండ్ చేశాడు. కుదరదని చెబితే చంటి పాప ఉన్న నన్ను సుదూర ప్రాంతానికి డిప్యూటేషన్‌పై వేశారు’’ అని లావణ్య వాపోయారు. ఎరువుల కొరతకు తోడు, రాజకీయ ఒత్తిళ్లతో తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నామని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. యూరియా లేక రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నామని, నానా దుర్భాషలాడుతున్నారని, భౌతిక దాడులకు దిగే పరిస్థితులున్నాయని వాపోయారు.
కార్యాలయంలోనే ఉన్న కలెక్టర్‌కు... సంబంధిత యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ బయటకు వచ్చి ఉద్యోగులతో మాట్లాడారు. ఎరువుల పంపిణీ నుంచి తమను మినహాయించి, శాఖ విధులు అప్పగించేలా చూడాలని వీఏఏలు కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో వ్యవసాయ, ఉద్యానవన అసిస్టెంట్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
100 బస్తాల యూరియాకు 150 ఫోన్లు
100 బస్తాల యూరియా వస్తే 150 పర్యవేక్షక ఫోన్లు, తమకంటే తమకు ఇవ్వాలని 150 మంది ఒత్తిడి చేస్తున్నారని వీఏఏలు వాపోయారు. నాయకుల సూచనల మేరకు తప్పులు జరిగితే చిరుద్యోగులైన తాము బలి అవుతున్నామని తెలిపారు. ఇలాంటి సమస్యలు క్షేత్ర స్థాయిలో అనేకం ఉన్నాయని, అధికారులకు తెలిసినా, పరిష్కారం చూపడం లేదని తెలిపారు. వ్యవసాయ సహాయకుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పలుచోట్ల యూరియా ఇతర ఎరువులను రాజకీయ నాయకులు పట్టుకెళ్లగా, ఆ ఆర్థిక భారం వీఏఏలపై పడిందని తెలిపారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలుసని, క్షేత్రస్థాయి ఉద్యోగులపై భారం వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, అ«ధికార ఒత్తిళ్లతో ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నారని, నిబంధనల ప్రకారం వీఏఏలకు సంబంధం లేని పనులు అప్పజెప్పి టార్గెట్లు విధించి మనస్తాపానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు.