
పురుగు మందు డబ్బాతో శ్రీకాకుళం జిల్లా పాతటెక్కలి రైతు
కూటమి పాలనలో చాలా ఇబ్బంది పడుతున్నాం
రైతు తీవ్ర ఆవేదన సోషల్ మీడియాలో వీడియో వైరల్
వజ్రపుకొత్తూరు రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటలకు అవసరమైన సమయంలో యూరియా కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. యూరియా కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిన ఓ రైతు సోషల్ మీడియాలో తన బాధను పంచుకున్నారు. యూరియా దొరక్కపోతే చచ్చిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామానికి చెందిన ఇచ్ఛాపురం గణపతి అనే రైతు ఆవేదన ఇలా ఉంది. ‘గణపతి అనే నేను ఆటో నడపలేక నాలుగు ఆవులను కొనుక్కున్నా. మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. ఓ వైపు నీరు సరిపడా లేకపోయినా ఇంజిన్లు పెట్టుకొని బాధలు పడుతున్నాం.
మరో వైపు యూరియా దొరకడం లేదు. గోల్‌మాల్ చేసేస్తున్నారు. ఎరువు కావాలంటే 1బి కావాలంటున్నారు. కౌలు రైతులకు 1బి, పాసు పుస్తకాలు ఇవ్వడం లేదు. సచివాలయాల్లో సిబ్బంది ఉండటం లేదు. రైతులకు దొరకని యూరియా బ్లాక్ మార్కెట్‌లో బస్తా రూ.700 పైచిలుకుతో దొరుకుతోంది. మొన్నే మా ఫ్రెండ్ బ్లాక్ మార్కెట్‌లో రూ.750తో కొనుక్కొచ్చాడు. ఆర్బీకేల్లో యూరియా ఎందుకు దొరకడం లేదు? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. కూటమి పాలనలో చాలా ఇబ్బంది పడుతున్నాం.
ఆటో వాళ్ల బతుకులు బాగో లేవు. రైతుల బతుకులూ అంతే. చదువుకున్న పిల్లలకు బతుకుదెరువు లేదు. డాక్టర్ కోర్సు చదవాలనుకున్న విద్యార్థులకు బతుకులు లేవు.. ఇలాగైతే ఎలా? ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఏమైనా అడిగితే అరెస్టులు.. తన్నండ్రా అని కూటమి నాయకులు అంటున్నారు. యూరియా దొరక్క.. ఎరువులు దొరక్క రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారే.. ఏం చేయాలో చెప్పండి సార్.. ఎలా వ్యవసాయం చేయాలి.. బతకాలా, ఎండ్రీను తాగి సావాలా.. పరిష్కారం చెప్పండి సార్. యూరియా దొరక్కపోతే వారంలో చచ్చిపోవాలనుకుంటున్నా..’ అని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పురుగుల మందు డబ్బా చూపిస్తూ ఈ రైతు వ్యక్తం చేసిన ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.