జూలై 4 నుంచి ఏపీ ఈఏపీసెట్‌

AP EAPCET from July 4th schedule was released by Adimulapu Suresh - Sakshi

షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏపీ ఈఏపీసెట్‌)–2022–23 పరీక్షలు జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ ఈఏసీసెట్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డితో కలిసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ వెయిటేజి యథాతథంగా ఉంటుందని చెప్పారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 4 నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష ఉంటుంది. రోజుకు రెండు సెషన్లలో మొత్తం 10 సెషన్లతో ఈ పరీక్ష జరుగుతుంది.

అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్ష జూలై 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో జరుగుతుంది. పరీక్షల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 11న విడుదల అవుతుందని మంత్రి చెప్పారు. ఇందులో పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయన్నారు. ఈఏపీసెట్‌ తుది ఫలితాలు ఆగస్టు 15 నాటికి విడుదల చేస్తామన్నారు. ఆలోగా ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదలై, మార్కులు కూడా వెల్లడవుతాయి కనుక ఇంటర్మీడియెట్‌ వెయిటేజీకి, తద్వారా ర్యాంకుల ప్రకటనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి తెలిపారు. సెప్టెంబర్‌ రెండో వారానికల్లా తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఎగ్జామినేషన్‌ ప్యాట్రన్, ర్యాంకుల విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

ఇతర పరీక్షలకు అడ్డంకి లేకుండా..
ఇతర ఏ పరీక్షలకూ అడ్డంకి కాకుండా ఈఏపీసెట్‌ తేదీలను ఖరారు చేశామని మంత్రి చెప్పారు. ‘ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24 తో ముగుస్తాయి. సీబీఎస్‌ఈ పరీక్షలు జూన్‌ 13న ముగుస్తాయి. జేఈఈ అడ్వాన్సుడ్‌ పరీక్ష జూలై 3న జరుగుతుంది. అందుకే ఈఏపీసెట్‌ జూలై 4 నుంచి నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. టీసీఎస్‌ అయాన్‌ సెంటర్లలో ఈ ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. గత ఏడాది 136 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామని, ఈసారి అవసరాన్ని బట్టి కేంద్రాలను పెంచుతామని చెప్పారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో 4 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 

డిప్లొమా పరీక్షల తేదీలను అనుసరించి ఈసెట్‌ షెడ్యూల్‌
ఇలా ఉండగా ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలోకి ప్రవేశానికి (లేటరల్‌ ఎంట్రీ) ఏపీఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను డిప్లొమా పరీక్షల తేదీలను అనుసరించి నిర్ణయించనున్నారు. డిప్లొమా పరీక్షల షెడ్యూల్‌పై  సాంకేతిక విద్యా మండలికి ఉన్నత విద్యా మండలి లేఖ రాసింది. ఆ షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఈసెట్‌ తేదీలు నిర్ణయిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top