పదో తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలి: ఆదిమూలపు సురేష్ | Adimulapu Suresh Fires On Chandrababu And Lokesh | Sakshi
Sakshi News home page

పదో తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలి: ఆదిమూలపు సురేష్

Jun 5 2025 5:44 PM | Updated on Jun 5 2025 6:43 PM

Adimulapu Suresh Fires On Chandrababu And Lokesh

సాక్షి, హైదరాబాద్: ఏపీలో పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై తక్షణం సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ నిర్వాకంపై ఆశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లోకేష్‌తో సహా బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ప్రభుత్వపరంగా విద్యాసంస్థల్లో ఇచ్చే అడ్మీషన్లను వాయిదా వేయాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే..

ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో తీవ్రస్థాయిలో తప్పులు జరిగాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిలోకం భగ్గుమంటోంది. అస్తవ్యస్తంగా పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేయించారు. విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పదో తరగతి పరీక్షలను, జవాబు పత్రాల మూల్యాంకనంను లేనిపోని గొప్పలకు పోయి, అడ్డగోలుగా, నిర్లక్ష్యంగా నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఫలితాలను వెలువరిస్తామంటూ చేసిన హడావుడికి ఎందరో విద్యార్దులు నష్టపోయారు.

పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వారం రోజుల్లోనే మూల్యాంకనాన్ని పూర్తి చేయాలంటూ టీచర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా సోషల్ స్టడీస్ జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం అయిదు రోజుల్లో పూర్తి చేశారనే విషయం బయటపడింది. ఏప్రిల్ 1న పరీక్షలు పూర్తయితే, ఏప్రిల్ 23న ఫలితాలను వెలువరించారు. అంటే దాదాపు 21 రోజులు తీసుకున్నారు. 2022-23 లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేవలం 17 రోజుల్లోనే సమర్థంగా పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.

కార్పోరేట్ విద్యాంస్థలకు లబ్ధి చేకూర్చడానికే..
కూటమి ప్రభుత్వంలోని విద్యాశాఖ కార్పోరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి చేసింది. జేఇఇ, నీట్ కోర్సులకు ఎక్కువ రోజులు కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనికోసం ముందుగానే పదో తరగతి ఫలితాలను వెలువరించాలనే ఒత్తిడికి విద్యాశాఖ తలొగ్గింది. ముందుగానే విద్యార్ధులను జాయిన్ చేసుకోవడం ద్వారా తమ విద్యా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసుకోవాలని కార్పోరేట్ సంస్థలు భావించాయి. విద్యార్ధుల అడ్మీషన్లతో సొమ్ములు దండుకోవడం కోసం కార్పోరేట్ విద్యా సంస్థల తొందరపాటుకు అనుగుణంగా ఏపీలోని విద్యాశాఖ పనిచేసిందనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకోసం వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడింది. ఇంత జరుగుతున్న విద్యాశాఖా మంత్రి నోరు మెదపడం లేదు.

స్వయంగా తన శాఖలోనే ఇంత అవతకవతకలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11వేల మందికి పైగా విద్యార్ధుల ఉత్తీర్ణతా మార్కులు మారాయి. రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం దాదాపు 60 వేల మంది దరఖాస్తు చేసుకుంటే, దానిలో 11 వేల మందికి పైగా విద్యార్దుల మార్కుల్లో తేడాలు కనిపించాయి. అంటే 30 శాతం పైచిలుకు జవాబుపత్రాల్లో తేడాలు కనిపించడం ఆందోళనకరం. ఇవి కేవలం దరఖాస్తు చేసుకున్న వారివే అయితే, ఇక దరఖాస్తు చేసుకోని వారు ఎంత మంది ఉంటారు? 20 మార్కులు వచ్చిన వారికి రీవాల్యుయేషన్‌లో 90 మార్కులు వచ్చాయి. అయిదు సబ్జెక్ట్‌లో పాస్ అయి, ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన వారికి రీవాల్యుయేషన్‌లో అత్యధిక మార్కులు వచ్చాయి. నెల్లూరుజిల్లాకు చెందిన సాయికుందన అనే విద్యార్ధినికి రీవాల్యుయేషన్‌ కు మందు 30 మార్కులు వస్తే, తరువాత 93 మార్కులు వచ్చాయి. దీనికి విద్యాశాఖ మంత్రి ఏం సమాధానం చెబుతారు? 

టీచర్లపై చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు
ఈ వ్యవహారానికి టీచర్లను బాధ్యులను చేసి, చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. దీనిపై కనీసం ఒక సమగ్ర విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించకపోవడం దారుణం. ఇటువంటి తప్పుల వల్ల పదోతరగతి విద్యార్ధులు నష్టపోకుండా కోరిన ప్రతి విద్యార్ధి జవాబుపత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి. దరఖాస్తు చేసుకోని వారికి కూడా గడువును పొడిగించాలి. తుది ఫలితాలు వచ్చే వరకు పాలిటెక్నిక్, రెసిడెన్షియల్, ట్రిపుల్ ఐటీల అడ్మిషన్లను వాయిదా వేయాలి. దీనికి బాధ్యులైన విద్యాశాఖ మంత్రితో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలి. రీవెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ ఫీజ్‌ను విద్యార్ధులకు రీఫండ్ చేయాలి.

ఈ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్ ప్రశ్నిస్తుంటే, విద్యాశాఖ మంత్రి ఈ సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుల తడకగా ఉన్న ఒక నోట్‌ను జారీ చేశాడు. పరీక్షల నిర్వహణ సరిగా లేదని నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. మార్చి 7వ తేదీన పరీక్షకు అరగంటకు ముందు ప్రశ్నాపత్రం లీకయ్యిందని నాగార్జన యూనివర్సిటీ అధికారులు గుర్తించి, అదే పరీక్షను మార్చి 12వ తేదీన తిరిగి నిర్వహించారు. ఇది మీశాఖ అసమర్థత కాదా?

మేం తెచ్చిన సంస్కరణలను నీరుగారుస్తున్నారు..
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగంలో అనే సంస్కరణలను తీసుకువచ్చాం. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ ట్యాబ్‌లు, టోఫెల్ శిక్షణ ఇలా అనే కార్యక్రమాలను కక్షకట్టి నీరుగార్చారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఐబీ గురించి నేడు ఎల్లో మీడియాలో వ్యంగ్యంగా ప్రకటనలు చేస్తున్నారు. ఐబీ అమలు రిపోర్ట్ కోసం అయిదు కోట్లు ఖర్చు పెట్టారు, ఐబీని తీసుకువచ్చినట్లు కలలు కంటున్నారని మాట్లాడుతున్నారు. పలు ఇంగ్లీష్ జాతీయ పత్రికల్లో ఏపీ ప్రభుత్వం స్విట‍్జర్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ బ్యాకలరీయేట్ ‌ఆర్గనైజేషన్‌తో ఎంఓయు చేసుకుందనే విషయాన్ని ప్రముఖంగా ప్రచురించిన విషయం వాస్తవం కాదా?

దానికి సంబంధించి ఆనాడు పలు జాతీయ దినపత్రికలు ప్రచురించిన వార్తలను కూడా మీ ముందు ఉంచుతున్నాం. దీని గురించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అవగాహన లేదు. ఐబీ సిలబస్ ద్వారా విద్యార్ధుల విద్య, వ్యక్తిగత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించవచ్చనే విషయం వారికి తెలియదు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఐబీ కరిక్యులమ్ ఉపయోగపడుతుంది. వైఎస్‌ జగన్‌ ప్రపంచ స్థాయిలో ఏపీ విద్యార్ధులు రాణించాలనే మంచి ఉద్దేశంతో ఈ కరిక్యులమ్‌ను ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో ముందుడుగు వేశారు.

దీని కోసం 2024-25లో ఉపాధ్యాయుల సామర్థ్యం, నైపుణ్యం పెంచే కార్యక్రమం, 2025-26లో ఒకటో తరగతి నుంచి విద్యార్ధులకు ఐబీ కరిక్యులమ్ అమలు చేస్తూ ప్రతి విద్యా సంవత్సరంలో ఒక్క తరగతి చొప్పున దానిని వర్తింప చేస్తూ పోవాలని ప్రణాళికను కూడా రూపొందించడం జరిగింది. 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతికి ఐబీ కరిక్యులమ్‌ను అమలు చేయడంను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలోని 150 దేశాల్లోని 5000 స్కూళ్ళలో ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ కరిక్యులమ్ అమలు లేదు. ఇలా గొప్ప విప్లవాత్మక మార్పులను మేం తీసుకువస్తే, నేడు కూటమి పార్టీలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement