పరీక్షలకు సన్నద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులు
విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. బంగారు భవితకు పునాది. ఉన్నత శిఖరాల అధిరోహణకు తొలిమెట్టు. అలాంటి పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో అధికారులు వంద శాతం ఉత్తీర్ణత సాధన కోసం ప్రత్యేక దృష్టి సారించారు.
ఇందుకోసం 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసి పాఠశాలల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో.. డిసెంబర్ నుంచి మార్చి వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల టీచర్లు విద్యార్థులకు ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. 2026 మార్చి 16 నుంచి మార్చి 1 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించిన షెడ్యూలు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇటీవల విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 605 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 28047 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. గతంలో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని, మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. సబ్జెక్టు వారీగా విద్యార్థులకు అసైన్‌మెంట్స్ నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించేలా వారికి ఉపాధ్యాయులు ప్రత్యేక తరీ్ఫదు ఇచ్చేలా ప్రధానోపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. 
రోజు వారి తరగతుల నిర్వహణ
వంద రోజుల ప్రణాళికలో భాగంగా డిసెంబర్ 6 నుంచి మార్చి 15 వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 9 వరకు రెమిడియల్ క్లాసులు, తరువాత 9.15 నుంచి సాయంత్ర 4 గంటల వరకు నాలుగు సబ్జెక్టుల బోధన ఉంటుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు వరకు ప్రతి రోజు ఒక సబ్జెక్టులో పరీక్ష నిర్వహిస్తారు. పరిక్షలో వచ్చిన మార్కులను ఆన్‌లైన్ చేస్తారు. ఆ మరుసటి రోజు ముందు రోజు చదవిన సబ్జెక్టుకు సంబంధించి పరీక్షలో వచ్చిన మార్కులపైన పునశ్చరణ తరగతులు ఉంటాయి.
ఇలా ఐదు రోజులపాటు శని, ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా ప్రణాళిక అమలు చేస్తారు. జనవరి నెలలో కేవలం సంక్రాంతికి సంబంధించి బోగి, సంక్రాంతి, కనుమ పండుగల మూడు రోజులు మినహా మిగతా రోజులు యథావిధిగా ప్రణాళిక అమలు అవుతుంది. ఇలా ప్రతి రోజు షెడ్యూల్ అమలు చేస్తున్నారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులంతా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారు ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్టుల్లో వెనుబడి ఉన్నారని గమనిస్తూ వారిలో భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసం నింపేలా కృషి చేస్తున్నారు.


