నెల్లూరు: జిల్లాలో కూటమి ప్రభుత్వంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. సంగం మండలం దువ్వూరు గ్రామంలో టిడిపి జనసేన నాయకులు మధ్య ఫ్లెక్సీల వివాదం కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది.

జనసేన నాయకడు భాను కిరణ్‌పై టీడీపీ నాయకులు దాడులకు దిగారు. ఈ ఘటనలో గాయపడ్డ జనసేన నేత భాను కిరణ్‌ను ఆత్మకూర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల కాలంలో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల మధ్య వర్గ విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. ఇవి జిల్లాల వారీగా స్థానిక నాయకుల మధ్య ఘర్షణలకు దారి తీస్తూ ప్రజల్లో అసంతృప్తి పెంచుతున్నాయి.
అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక నేతల పనితీరు, అధికారుల వ్యవహారశైలి పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో చంద్రబాబు నాయుడు జిల్లా వారీగా సర్వేలు చేయిస్తున్నారని సమాచారం.

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణలు బహిరంగంగా జరిగాయి. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత వ్యాఖ్యలు జనసేన వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఒంగోలులోనూ నేతల మధ్య విభేదాలు ముదిరాయి.
కర్నూలు జిల్లా: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కేటాయింపులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీసీ వర్గాలకు విలువ ఇవ్వలేదని ఆరోపణలు, పదవుల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తమైంది.


