అధికారుల తనిఖీల్లో నిర్ధారణఫుడ్‌పాయిజనే కారణమా?
విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేశారు. యూనివర్శిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణ కమిటీ ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో తెనాలి సబ్ కలెక్టర్, ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ఆహార తనిఖీ అధికారి, పౌర సరఫరాల అధికారులను నియమించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో అధికారులు తనిఖీలు చేశారు. క్యాంటీన్‌లో ఆహారం నాసిరకంగా ఉన్నట్లు గుర్తించామని తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా తెలిపారు. దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారం రోజుల నుంచి రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతున్నారని, పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇద్దరు విద్యార్థులు మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఆరుగురితో కమిటీ
ఈ సందర్భంగా మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మీడియాతో మాట్లాడారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై వాస్తవాలను నిర్ధారించి చర్యలకు ఉపక్రమించేందుకు జిల్లా కలెక్టర్ ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ఘటనకు కారణమేమిటన్నది ఖచి్చతంగా తెలుసుకునేందుకు పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందన్నారు.
సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల నుంచి సరఫరా అవుతున్న నీటి వలన సమస్య తలెత్తిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. ఆహారం వండేందుకు వినియోగిస్తున్న నీరు, తాగునీరు శాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా యూనివర్శిటీకి మెమో జారీ చేస్తామని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయని, నివేదిక ఆధారంగా యూనివర్శిటీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎస్‌ఆర్‌ఎం వర్శిటీకి సెలవులు
ఇదిలా ఉంటే ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్శిటీ రిజిస్ట్రార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్శిటీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ వల్ల పలువురు అనారోగ్యానికి గురైనట్టు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని యూనివర్శిటీ అంతటా శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, మెస్‌తోపాటు వంట గదులు, హాస్టల్ మొత్తం శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు వారాలపాటు సెలవులు ఇచి్చనట్టు వెల్లడించారు.


