‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేసిన మంత్రి లోకేశ్
ఇంజినీరింగ్ విభాగంలో అర్హత సాధించిన వారు 70.52%
అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీలో ఉత్తీర్ణత పొందిన వారు 89.59%
సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2026 ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేశారు. అలాగే సెట్ చైర్మన్, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సెట్ కన్వీనర్ ఎన్.మోహనరావు కూడా కాకినాడ జేఎన్‌టీయూలో ఈ ఫలితాలను వెల్లడించారు. జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో మే 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,76,572 మంది దరఖాస్తు చేసుకోగా, 2,58,545 మంది పరీక్షలకు హాజరయ్యారు, వీరిలో 1,82,317 మంది (70.52%) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో 79,231 మంది దరఖాస్తు చేసుకోగా, 70,929 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 63,546 మంది (89.59%) అర్హత సాధించారు. కాగా, ఇంజినీరింగ్‌లో గుంజూరు జిల్లా తాడేపల్లికి చెందిన జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన శంబంగి జశ్వంత్ నాయుడు టాపర్‌గా నిలిచాడు. ఫలితాలను https://cets. apsche.ap. gov.in/ EAPCETలో చూడవచ్చు.
ఇంజినీరింగ్ అండ్ ఫార్మసీ టాప్ ర్యాంక్స్ ఇవే..
1. జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి (గుంటూరు జిల్లా)
2. కోరుకొండ శ్రావ్య (శ్రీకాకుళం)
3. వెన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి (పల్నాడు)
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ టాపర్లు వీరే..
1. శంబంగి జశ్వంత్ నాయుడు (విజయనగరం)
2. అక్షజ్ రెడ్డి (మేడ్చల్ మల్కాజిగిరి)
3. హారికాదేవి శ్రీ అనూహ్య (కృష్ణా)


