కదిలిన సంక్షేమ రథ చక్రాలు

AP CM YS Jagan Mohan Reddy launches door delivery of ration supplies - Sakshi

ఇక పేదలకు ఇంటి వద్దే రేషన్‌ సరుకులు

పంపిణీ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

విజయవాడలో 2,503 వాహనాలకు జెండా ఊపి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి

నాణ్యమైన బియ్యం తీసుకునేందుకు ఉచితంగా ఇచ్చే సంచుల ఆవిష్కరణ

45 నిమిషాల పాటు వాహనదారులకు నమస్కరిస్తూ అభినందనలు

ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన 9,260 మొబైల్‌ వాహనాలు

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో :  ప్రజా పంపిణీ వ్యవçస్థలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ.. పేదల గడప వద్దకే వెళ్లి సరుకులు చేరవేసేలా నూతన ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారు. రేషన్‌ సరుకుల కోసం రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు రేషన్‌ షాపుల వద్ద గంటల తరబడి వేచి చూడకుండా వచ్చే నెల నుండి వారి ఇంటికే చేరనున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ బెంజిసర్కిల్‌లో గురువారం ఉదయం 10.45 గంటలకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,503 వాహనాలకు సీఎం వైఎస్‌ జగన్‌ జెండా ఊపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 9,260 జగన్నాథ రథాల చక్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ముందుకు కదిలాయి. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం తీసుకునేందుకు వీలుగా, తిరిగి వినియోగించుకునేలా ఒకసారి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనున్న నార సంచులను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.   

వాహనదారులందరికీ సీఎం నమస్కరిస్తూ..
విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన 2,503 వాహనదారులందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులు జోడించి నమస్కరిస్తూ అభినందనలు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన వేదికపై ఉండి కుయ్‌.. కుయ్‌.. మంటూ హారన్‌ వినిపిస్తూ ముందుకెళ్లిన తొలి వాహనం నుండి చివరి వాహనం వరకు సీఎం నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. వాహనదారులు రెట్టింపు ఉత్సాహంతో  ఈ సన్నివేశాన్ని తమ మొబైల్‌ ఫోన్‌లలో చిత్రీకరిస్తూ ముందుకు కదలడం కన్పించింది.  

నాణ్యమైన బియ్యం పంపిణీతో ఏటా రూ.830 కోట్ల అదనపు భారం  
నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.830 కోట్లు అదనపు భారం పడనుంది. అదేవిధంగా ఇంటింటా సరుకుల పంపిణీకి కొనుగోలు చేసిన 9,260 వాహనాలకు రూ.539 కోట్లు ఖర్చు చేసి పేద వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్‌లైంది. ఈ వాహనాలను నిరుద్యోగులకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో ఇవ్వడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. వాహనదారులకు ప్రతి నెలా 18 రోజుల పని దినాలు కల్పిస్తూ ఆరేళ్ల పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  

వాహనాల కేటాయింపులో పారదర్శకత  
వాహనాల కేటాయింపులో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించింది. ఇందులో భాగంగా వర్గాల వారీగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2,300, ఎస్టీ కార్పొరేషన్‌ నుండి 700, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 3,800, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 660, ఈబీ (ఎకనామికల్లీ బ్యాక్‌వార్డ్‌) కార్పొరేషన్‌ ద్వారా 1,800 మందికి వాహనాలను అందజేశారు. యూనిట్‌ ధర రూ.5,81,000 కాగా అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,48,600 అందించింది. బ్యాంకు లింకేజి ద్వారా రూ.1,74,357 మంజూరు చేయగా, లబ్ధిదారుని వాటాగా కేవలం రూ.58 వేలు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు లింకేజీ రుణం చెల్లించేందుకు సౌలభ్యం కల్పించేలా పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా అద్దె చెల్లించే విధానంలో ఈ వాహనాలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్య, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకూరి శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పలువులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ప్రజా పంపిణీ వ్యవస్థలో నవ శకం
జిల్లాల్లో వాహనాలు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు
సాక్షి నెట్‌వర్క్‌: ప్రజా పంపిణీ వ్యవçస్థలో నవ శకం దిశగా అడుగులు పడ్డాయి. పేదల గడప వద్దకే వెళ్లి రేషన్‌ సరుకులు అందించే మినీ ట్రక్కులను గురువారం విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్, వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం వందలాది మినీ ట్రక్కులు ఆయా జిల్లా కేంద్రాల్లో ఒక్కసారిగా రోడ్లపై వరుసగా పరుగు పెట్టడం కనువిందు చేసింది. బారులు తీరిన వాహనాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పలువురు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ట్రక్కుల మంజూరు ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది.

జగనన్నకు కోటి వందనాలు
నాకు భర్త, ఇద్దరు పిల్లలు. అత్తమామలతో కలసి ఉంటున్నాము. నా భర్త ఆటో నడుపుతుంటాడు. నాకు కూడా ఆటో నడపడం నేర్పించాడు. ఆ తర్వాత నేను కారు నడపడం కూడా నేర్చుకున్నాను. నా భర్త పోడు వ్యవసాయానికి వెళ్లినప్పుడు నేను ఉదయమే ఇంటి పనులు ముగించుకుని ఆటో నడిపేందుకు వెళుతుంటాను. ఇప్పుడు నాకు ఉచిత రేషన్‌ సరుకుల వాహనం మంజూరైంది. శ్రీకాకుళంలో ఇవాళ ఈ వాహనాన్ని నడుపుకుంటూ వెళుతుండటం ఆనందంగా ఉంది. బతుకుపై మరింత భరోసా కలిగింది. ఇందుకు కారణమైన సీఎం జగనన్నకు కోటి వందనాలు.

– సవర సుహాసిని, ఎస్‌.బాణాపురం, మెలియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లారేషన్‌ పంపిణీ వాహనంలో తూకాన్ని పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌


రేషన్‌ çసరుకుల పంపిణీ వాహనాల తాళాన్ని డ్రైవర్లకు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌


ఉచితంగా ఇవ్వనున్న నార సంచులను ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు తదితరులు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top