breaking news
Public Distribution Scheme
-
కదిలిన సంక్షేమ రథ చక్రాలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో : ప్రజా పంపిణీ వ్యవçస్థలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ.. పేదల గడప వద్దకే వెళ్లి సరుకులు చేరవేసేలా నూతన ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారు. రేషన్ సరుకుల కోసం రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి చూడకుండా వచ్చే నెల నుండి వారి ఇంటికే చేరనున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ బెంజిసర్కిల్‌లో గురువారం ఉదయం 10.45 గంటలకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,503 వాహనాలకు సీఎం వైఎస్ జగన్ జెండా ఊపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 9,260 జగన్నాథ రథాల చక్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ముందుకు కదిలాయి. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం తీసుకునేందుకు వీలుగా, తిరిగి వినియోగించుకునేలా ఒకసారి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనున్న నార సంచులను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వాహనదారులందరికీ సీఎం నమస్కరిస్తూ.. విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన 2,503 వాహనదారులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులు జోడించి నమస్కరిస్తూ అభినందనలు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన వేదికపై ఉండి కుయ్.. కుయ్.. మంటూ హారన్ వినిపిస్తూ ముందుకెళ్లిన తొలి వాహనం నుండి చివరి వాహనం వరకు సీఎం నమస్కరించడం అందరినీ ఆకట్టుకుంది. వాహనదారులు రెట్టింపు ఉత్సాహంతో ఈ సన్నివేశాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ ముందుకు కదలడం కన్పించింది. నాణ్యమైన బియ్యం పంపిణీతో ఏటా రూ.830 కోట్ల అదనపు భారం నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.830 కోట్లు అదనపు భారం పడనుంది. అదేవిధంగా ఇంటింటా సరుకుల పంపిణీకి కొనుగోలు చేసిన 9,260 వాహనాలకు రూ.539 కోట్లు ఖర్చు చేసి పేద వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్లైంది. ఈ వాహనాలను నిరుద్యోగులకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో ఇవ్వడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. వాహనదారులకు ప్రతి నెలా 18 రోజుల పని దినాలు కల్పిస్తూ ఆరేళ్ల పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాహనాల కేటాయింపులో పారదర్శకత వాహనాల కేటాయింపులో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించింది. ఇందులో భాగంగా వర్గాల వారీగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,300, ఎస్టీ కార్పొరేషన్ నుండి 700, బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 660, ఈబీ (ఎకనామికల్లీ బ్యాక్వార్డ్) కార్పొరేషన్ ద్వారా 1,800 మందికి వాహనాలను అందజేశారు. యూనిట్ ధర రూ.5,81,000 కాగా అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,48,600 అందించింది. బ్యాంకు లింకేజి ద్వారా రూ.1,74,357 మంజూరు చేయగా, లబ్ధిదారుని వాటాగా కేవలం రూ.58 వేలు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు లింకేజీ రుణం చెల్లించేందుకు సౌలభ్యం కల్పించేలా పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా అద్దె చెల్లించే విధానంలో ఈ వాహనాలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్య, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకూరి శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పలువులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో నవ శకం జిల్లాల్లో వాహనాలు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు సాక్షి నెట్వర్క్: ప్రజా పంపిణీ వ్యవçస్థలో నవ శకం దిశగా అడుగులు పడ్డాయి. పేదల గడప వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించే మినీ ట్రక్కులను గురువారం విజయవాడలో సీఎం వైఎస్ జగన్, వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం వందలాది మినీ ట్రక్కులు ఆయా జిల్లా కేంద్రాల్లో ఒక్కసారిగా రోడ్లపై వరుసగా పరుగు పెట్టడం కనువిందు చేసింది. బారులు తీరిన వాహనాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పలువురు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ట్రక్కుల మంజూరు ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది. జగనన్నకు కోటి వందనాలు నాకు భర్త, ఇద్దరు పిల్లలు. అత్తమామలతో కలసి ఉంటున్నాము. నా భర్త ఆటో నడుపుతుంటాడు. నాకు కూడా ఆటో నడపడం నేర్పించాడు. ఆ తర్వాత నేను కారు నడపడం కూడా నేర్చుకున్నాను. నా భర్త పోడు వ్యవసాయానికి వెళ్లినప్పుడు నేను ఉదయమే ఇంటి పనులు ముగించుకుని ఆటో నడిపేందుకు వెళుతుంటాను. ఇప్పుడు నాకు ఉచిత రేషన్ సరుకుల వాహనం మంజూరైంది. శ్రీకాకుళంలో ఇవాళ ఈ వాహనాన్ని నడుపుకుంటూ వెళుతుండటం ఆనందంగా ఉంది. బతుకుపై మరింత భరోసా కలిగింది. ఇందుకు కారణమైన సీఎం జగనన్నకు కోటి వందనాలు. – సవర సుహాసిని, ఎస్.బాణాపురం, మెలియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా రేషన్ పంపిణీ వాహనంలో తూకాన్ని పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ రేషన్ çసరుకుల పంపిణీ వాహనాల తాళాన్ని డ్రైవర్లకు అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఉచితంగా ఇవ్వనున్న నార సంచులను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు తదితరులు. -
ఉచిత బియ్యంతో సోమరులవుతున్నారు!
చెన్నై: ధనిక, పేద తేడా లేకుండా అందరికీ ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తుండటంతో ప్రజలు బద్దకస్తులుగా మారుతున్నారని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకే ఉచిత బియ్యం అందేలా నిబంధనలు సవరించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రజా పంపిణీ పథకం బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడంటూ పోలీసులు ఓ వ్యక్తిని గూండా చట్టం కింద నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. ధనిక, పేద ఇలా అందరికీ ఉచిత బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,110 కోట్లు ఖర్చుచేసింది. దీంతో ‘కనీస సౌకర్యాలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను నిరుపేదలకు అందివ్వడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు మాత్రం రాజకీయ లబ్ధి కోసం వీటిని అందరికీ ఇస్తున్నాయి. దీంతో ప్రజలు బద్దకస్తులుగా మారారు’ అని కోర్టు పేర్కొంది. -
ఈ-పాస్.. తొలిరోజు ఫెయిల్
ప్రజా పంపిణీ పథకంలో ‘ఈ-పాస్’ అమలు జిల్లాలో తొలిరోజు ఫెయిల్ అయింది. యంత్రాల వినియోగంలో డీలర్లకు అవగాహన లేమి, సాంకేతిక సమస్యలు వెరసి మూడో వంతు షాపుల్లోనూ నిత్యావసరాల పంపిణీ ప్రారంభం కాలేదు. అనుకున్నట్టుగానే ఈ విధానం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ప్రారంభంలో దాదాపు అన్ని షాపుల్లోనూ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఎక్కడా ఆధార్ సర్వర్‌కు, సివిల్ సప్లయిస్ సర్వర్‌కు కనెక్ట్ కాలేదు. సిగ్నెల్స్ లేక సెల్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయలేదు. టెక్నీషియన్లకు వందలాది ఫోన్‌కాల్స్ రావడంతో వారు కూడా చేతులెత్తేశారు. పౌరసరఫరాలశాఖ అధికారులు డీలర్లకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నం : జిల్లాలో ఈ-పాస్(ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) ఇక్కట్లు మొదలయ్యాయి. జీవీఎంసీతో పాటు అన్ని మున్సిపాల్టీల్లోనూ ఒకే సారి అమలుతో సమస్యలు తలెత్తాయి. డీలర్లకు కేవలం రెండురోజులు శిక్షణతో సరిపెట్టారు. మెజార్టీ డీలర్లకు వీటి వియోగంపై కనీస అవగాహన లేదు. ఇక షాపుల్లో పనిచేసే ఇతర సిబ్బందికి అసలు ఇవి ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు. నెలరోజులుగా సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు విఫలయత్నం చేసినా ఆచరణలో మాత్రం ఫలితం దక్కలేదు. జీవీఎంసీ పరిధిలో 412 షాపులు, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల్లో 274 షాపుల్లో బుధవారం నుంచి ఒకేసారి ఈ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన కొద్దిసేపటికే మిషన్లను ఏ విధంగా వినియోగించాలో తెలియక డీలర్లు తీవ్రగందరగోళానికి గురయ్యారు. మరొకపక్క ఈపాస్ మిషన్లు మొరాయించడంతో 80 శాతం షాపుల్లో పంపిణీకి శ్రీకారమే చుట్టలేదు. ప్రారంభంలో దాదాపు అన్ని షాపుల్లోనూ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఎక్కడా ఆధార్ సర్వర్‌కు, సివిల్ సప్లయిస్ సర్వర్‌కు కనెక్ట్ కాలేదు. ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు కూడా పూర్తిగా స్థాయిలో పనిచేయలేదు. మరోపక్క జీవీఎంసీ పరిధిలోని అన్ని షాపులకు అందజేసిన ఐరిస్ మిషన్లను కనీసం వినియోగంలోకి తీసుకురాలేక పోయారు. ఇదేరోజు ఆహారభద్రత పథకానికి కూడా శ్రీకారం చుట్టడంతో అన్ని షాపుల్లో ఇప్పటి వరకు యూనిట్‌కు ఇస్తున్న బియ్యం కోటా 4కిలోలను 5 కిలోలకు పెంచేందుకు వీలుగా మిషన్‌లో సాప్ట్వేర్ అప్లోడ్ చేయడంతోనే తొలిరోజు గడిచిపోయింది. దీంతో తొలిరోజు వచ్చిన వినియోగదారుల్లో కనీసం 20 శాతం మందికి కూడా నిత్యావసరాలు పంపిణీ చేయలేకపోయారు. మొరాయించిన మిషన్లు... రోడ్డెక్కిన డీలర్లు ఈ విధానం పట్ల కనీస అవగాహన లేని డీలర్లు ఆందోళన బాట పట్టారు. జీవీఎంసీలోని సర్కిల్-2 పరిధిలో వందమందికి పైగా డీలర్లు రేసపువానిపాలెంలోని ఏఎస్వో కార్యాలయం ఎదుట పనిచేయని మిషన్లతో ఆందోళన చేపట్టారు. ఈ సర్కిల్ పరిధిలో 126 షాపులుంటే కనీసం పాతిక షాపుల్లోనూ మిషన్లు పనిచేయని దుస్థితని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఆన్ చేసిన రెండు నిమిషాలకే మొరాయిచాయని, సిగ్నెల్స్ ఉండడం లేదు.. సర్వర్లు డౌన్ అయిపోతున్నాయంటూ మండిపడ్డారు. తమకే కాదు..కనీసం సివిల్ సప్లయిస్ అధికారులు కూడా అవగాహనలేదని అందరూ టెక్నీషియన్స్పైనే ఆధారపడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. 686 మిషన్లకు 20 మంది టెక్నీషియన్లు ఏమూలకుసరిపోతారని ప్రశ్నిస్తున్నారు. వీటి అమలును తాము వ్యతిరేకించడం లేదని...మాకు పూర్తిగా అవగాహన కల్పించి.. సాంకేతిక సమస్యలను పూర్తిగా పరిష్కరించాక దశలవారీగా అమలు చేస్తే బాగుంటుందని జిల్లా రేషన్‌షాపు డీలర్లసంఘం అధ్యక్షుడు చిట్టిబాబు కోరారు. కాగా ఒకటి రెండురోజుల్లో ఈ పరిస్థితిని చక్కదిద్ది పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయిస్ అధికారులు చెబుతున్నారు.