
వైఎస్సార్ కడప జిల్లా చెన్నేపల్లి పాఠశాల ముందు పేరెంట్స్ మీటింగు జరగనివ్వమని ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
పేరెంట్–టీచర్ సమావేశాల్లో భగ్గుమన్న తల్లిదండ్రులు
పురుగులన్నం పెడుతున్నారని ఫైర్
‘గోరుముద్ద’ పేరు మార్చి నీరుగార్చారు
పాఠశాలల విలీనంపైనా తీవ్ర అభ్యంతరాలు
కనీస సౌకర్యాలు కల్పిస్తేనే తమ పిల్లలను స్కూల్‌కు పంపుతామని.. లేదంటే టీసీలు ఇవ్వాలని డిమాండ్
ఉపాధ్యాయుల్లేని సమావేశాలెందుకని అధికారుల నిలదీత
2.28 కోట్ల మంది పాల్గొంటారని ప్రచారం.. అందులో సగం కూడా రాని వైనం
70 శాతానికి పైగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ సమావేశాల ఊసేలేదు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: గిన్నిస్ రికార్డు కోసం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి ప్రభుత్వం గురువారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్స్ సమావేశం (మెగా పీటీఎం 2.0) విఫలమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులకు, అధికారులకు చాలాచోట్ల తల్లిదండ్రులు షాకిచ్చారు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యత దారుణంగా ఉందని.. మీ పిల్లలకు ఇలాగే పెడతారా అంటూ నిలదీశారు. ‘గోరుముద్ద’గా పేరు మారిస్తే సరిపోదని.. అంతే గొప్పగా అందించాలన్నారు.
పాఠశాలల్లో పెట్టే భోజనం తినలేక పిల్లలు ఇబ్బందిపడుతున్నారని, ఒక్కరోజు తింటే అరగక ఆస్పత్రి పాలవుతున్నారని విజయవాడలో తల్లులు అధికారులను ఘెరావ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన ‘మెగా పీటీఎం’లో అనేక ప్రాంతాల్లో ఇదే తరహాలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మొత్తం 61,135 విద్యా సంస్థల్లో తలపెట్టిన ఈ మెగా పీటీఎం కేవలం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకే పరిమితమైంది. 70 శాతానికి పైగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా తరగతులు నిర్వహించాయి.
మెగా పీటీఎంలో 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులు, దాతలు తదితరులు మరో 1,49,92,456 మంది కలిపి మొత్తం 2,28,21,454 మంది పాల్గొంటారని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ, అందులో సగం మంది కూడా హాజరుకానట్లు తెలుస్తోంది. ఇది గిన్నిస్ రికార్డుపై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాల్లో ఎలా జరిగిందంటే..
» వైఎస్సార్ కడప జిల్లాలోని చాలా పాఠశాలల్లో తల్లిదండ్రులు ఈ సమావేశాలకు హాజరుకాలేదు. బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలం చెన్నుపల్లె ప్రాథమిక పాఠశాలకు సంబంధించి 3, 4, 5 తరగతులకు సంబంధించిన పిల్లలను ఎస్. వెంకటాపురం పాఠశాలలో విలీనం చేశారు. తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపబోమంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.
» చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోందని తల్లిదండ్రులు మండిపడ్డారు. పేరెంట్స్–టీచర్స్ సమావేశం జరుగుతున్నా కూడా ఉడకని అన్నం, గుడ్లను పెట్టడంతో విద్యార్థులు పడేయగా దీనిపై తల్లిదండ్రులు ఎంఈఓ నటరాజరెడ్డికి ఫిర్యాదుచేశారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పిస్తేనే తమ పిల్లలను స్కూల్‌కు పంపుతామని.. లేదంటే టీసీలు ఇవ్వాలని డిమాండు చేశారు.
» తిరుపతి జిల్లాలోని కేవీబీ పురం మండలంలోని బంగారమ్మ కండ్రిగ, గురుకుల కండ్రిగ, అనంతపద్మనాభపురం గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల విలీనంపై తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాలలకు తాళాలు వేసి ఈ సమావేశాన్ని బహిష్కరించారు. ఉపా«ద్యాయులను వెనక్కు పంపారు.
»పల్నాడు జిల్లా నకరికల్లు పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని.. మీ పిల్లలకైతే ఇలాంటి భోజనమే పెడతారా అంటూ తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు.
» ఈ సమావేశం రోజు కూడా విద్యార్థులకు ఉడికీ ఉడకని అన్నం పెట్టడంతో ప్రకాశం జిల్లా మర్రిపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు మండిపడ్డారు. పెద్దదోర్నాల కస్తూరిబా పాఠశాలలో పారిశుధ్యం లోపించిందని.. పిల్లలు అంటువ్యాధుల బారిన పడుతున్నారని ఫిర్యాదుచేశారు.
» ప్రభుత్వం అందించిన బ్యాగులు నాసిరకంగా ఉన్నాయని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థి తండ్రి ఆరోపించారు.
» అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలుచోట్ల మెగా పేరెంట్స్ మీటింగ్ రసాభాసగా సాగింది. జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ భూసుకొండలో ఉపాధ్యాయుల్లేని సమావేశాలెందుకని గ్రామస్తులు అధికారులను నిలదీశారు.