నీట్‌ ఫలితాల ఆలస్యంపై విద్యార్థుల్లో ఆగ్రహం 

Anger among students over delay in NEET results - Sakshi

సాక్షి, అమరావతి: నీట్‌–2021 ఫలితాలను వెల్లడించడంలో జరుగుతున్న జాప్యంపై అభ్యర్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మెడికల్, డెంటల్, ఆయుష్‌ విభాగాల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్‌ 12వ తేదీన దేశ వ్యాప్తంగా ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఏటా ఈ పరీక్ష నిర్వహించాక నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. క్వశ్చన్‌ పేపర్‌ తారుమారు అయిందన్న కారణంతో ఇద్దరు విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ముంబయి హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఏన్‌టీఏ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ‘16 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం ఇది.

ఆ ఇద్దరికి పరీక్ష నిర్వహించాక మొత్తంగా ఫలితాలు విడుదల చేసేందుకు ఆలస్యం అవుతుంది. ముంబయి హైకోర్టు తీర్పు పై స్టే విధిస్తే వెంటనే ఫలితాలు విడుదల చేస్తాం. నీట్‌ పరీక్ష ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి’ అని ఐదు రోజుల క్రితం సుప్రీంకోర్టుకు నివేదించింది. ‘వారిద్దరి సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఫలితాలు విడుదల చేయండి’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో అదే రోజో.. మరుసటి రోజో ఫలితాలు వెలువడతాయని విద్యార్థులు ఆశించారు. కనీసం ఎప్పుడు విడుదల చేస్తారో కూడా ఎన్‌టీఏ ప్రకటించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పెద్ద ఎత్తున విద్యార్థులు విమర్శిస్తూ ట్విటర్‌లో ఎన్‌టీఏను ట్యాగ్‌ చేశారు. నీట్‌ ఫలితాల కోసం పలు రాష్ట్రాల్లో ఇతరత్రా అడ్మిషన్లు సైతం నిలిచిపోవడం గమనార్హం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top