రాష్ట్ర పోలీసులకు హైకోర్టు హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా ప్రజల హక్కులను, స్వేచ్ఛను హరిస్తూ సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ ఇష్టారీతిన చెలరేగిపోతున్న పోలీసులపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. చట్ట పరిధి దాటి సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ప్రజల సంక్షేమమే అత్యున్నత చట్టమనే విషయాన్ని పోలీసులు గ్రహించాలంది. ప్రజల ప్రాణాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులు, శాంతి భద్రతలను రక్షించడానికే పోలీసులున్నారని హైకోర్టు గుర్తు చేసింది. అంతే తప్ప ప్రజలపై అధికారం చలాయించడానికి కాదని తేల్చి చెప్పింది.
తాము ప్రజల కంటే పైస్థాయిలో ఉన్నామన్న రీతిలో పోలీసులు వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పౌరులపై నియంత్రణలేని అధికారాన్ని పోలీసులు చలాయించలేరని తెలిపింది. రాజ్యాంగ సూత్రాలకు సంరక్షకులుగా పోలీసులు వ్యవహరించాలని హైకోర్టు హితవు పలికింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం చట్టం పోలీసులకు ఇవ్వలేదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు.
సివిల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న తమ సివిల్ వివాదాల్లో పోలీసులు అకారణంగా జోక్యం చేసుకుంటున్నారని, పోలీస్‌స్టేషన్‌కు పిలిపిస్తూ వివాదాలను పరిష్కరించుకోవాలని బెదిరిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన పౌరులు హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకుండా పోలీసులను నిరోధించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన న్యాయమూర్తి, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై గత ఏడాది అక్టోబర్ 24న డీజీపీ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని పోలీసులను తన తీర్పులో ఆదేశించారు.
స్వాతంత్య్రం వచ్చినా వలసవాద పోలీస్ వ్యవస్థ మారలేదు
‘ప్రసిద్ధ న్యాయ శాస్త్రవేత్త ఉపేంద్ర భక్షి చెప్పినట్లు.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా కూడా వలసవాద పోలీస్ వ్యవస్థ మాత్రం అంతం కాలేదు. కేవలం యజమానులు మాత్రమే మారారు. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ పోలీసుల నిర్మాణం, పద్ధతులు, చట్టపరమైన విధానాలు ఎక్కువగా 1861 నాటి పోలీస్ చట్టం ఆధారంగానే కొనసాగాయి. ఈ వ్యవస్థ పౌర సేవా దృక్పథం కంటే, శాంతి భద్రతలను కాపాడటం, జనాలను నియంత్రించడం, పాలకుల ప్రయోజనాలను రక్షించడం కోసమే ప్రధానంగా రూపుదిద్దుకుంది.
అందువల్ల, బ్రిటిష్ పాలకుల స్థానంలో ఎన్నికైన భారత ప్రభుత్వం వచ్చినప్పటికీ, పోలీసుల ప్రాథమిక సంస్థాగత స్వరూపంలో పెద్దగా మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఆధునిక భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా, వలసవాద పోలీస్ వ్యవస్థ.. ప్రజలే కేంద్రంగా సాగే ప్రజాస్వామ్య పోలీసింగ్ (డెమోక్రటిక్ పోలీసింగ్)గా మారాలి. ఇందుకు అందరూ సహకరించాలి. అంటే పోలీసులు చట్ట పరిమితులకు లోబడి అధికారాలను ఉపయోగించడం, రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్థలకు జవాబుదారీగా ఉండటం, పౌరుల చట్టపరమైన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండటం వంటి దిశలో చర్యలు ఉండాలి’
పరిధి లేని వ్యవహారాల్లో జోక్యం సమాజానికి మంచిదికాదు
‘పోలీసులు చట్టబద్ధమైన అధికార పరిధి లేకుండా పౌరుల హక్కులలో జోక్యం చేసుకుంటే, అది మొత్తం సమాజంపైనే కాకుండా పోలీసుల వి«ధి నిర్వహణపై కూడా తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. ఓ పోలీస్‌స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన సిబ్బంది, తమకు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, కేవలం తమ ఇష్టానుసారంగా సివిల్ వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే, అది సమస్యలను మరింత జఠిలం చేస్తుంది.
ఈ రకమైన పోలీసుల ప్రవర్తన చివరికి శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తుంది. పోలీసులు చట్టబద్ధమైన పోలీసింగ్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించకుండా అడ్డుకుంటుంది. ఇది సమాజ శ్రేయస్సుకైనా, లేదా పోలీస్‌శాఖ హితానికైనా ఏమాత్రం మంచిది కాదు. స్వేచ్ఛను ప్రభావితం చేసే కార్యనిర్వాహక విచక్షణ అధికారాన్ని అడ్డూ అదుపు లేకుండా వాడకూడదు. ఆ అధికారం తార్కిక, హేతుబద్ధ కారణాలు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై ఆధారపడి ఉండాలి. అంతే తప్ప, అస్పష్టమైన లేదా అర్థంలేని స్వీయ నిర్ణయాలపై ఆధారపడి పోలీసుల అధికారాలు ఉండకూడదు’
– జస్టిస్ కుంచెం మహేశ్వరరావు తీర్పు


