
కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలియదా?
మీకెంత మాత్రం బాధ్యత లేదు
నిందితులకు సహకరిస్తున్నారు
మేం రికార్డుల సీజ్‌కు ఆదేశాలిచ్చాం..
ఆ ఆదేశాలను అమలు చేసే వారే సీఐడీలో లేరా?
ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే నిందించాలి
పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, అమరావతి: కేసుల దర్యాప్తు, హైకోర్టులఉతర్వుల అమలు విషయంలో పోలీసుల పనితీరుపై తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్న హైకోర్టు, ‘డీజీపీ నిద్రపోతున్నారా?’ అంటూ మరో సారి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక కేసుకు సంబంధించి రికార్డులన్నింటినీ తక్షణమే సీజ్ చేయాలన్న తమ ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రికార్డులను సీజ్ చేయాలని తాము గత నెల 19న ఆదేశాలు ఇస్తే, ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడంపై మండిపడింది. రికార్డులను సీజ్ చేయాలని తాము సీఐడీ ఐజీని ఆదేశించామని, అయితే సీఐడీ ఐజీ పోస్టులేదంటూ ఈ నెల 6న అనుబంధ పిటిషన్ దాఖలు చేయడమేమిటని ఆక్షేపించింది.
సెప్టెంబర్ 19న ఆదేశాలిస్తే, అక్టోబర్ 6వ వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. డీజీపీ నిద్రపోతున్నారా? అంటూ మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే ఐజీ లేకున్నా, మరో అధికారి చేత తమ ఆదేశాలను అమలు చేసి ఉండేవారని పేర్కొంది. గతంలో ఓ కేసులో ఇదే కోర్టు సీఐడీ ఐజీకి ఆదేశాలు ఇచ్చిందని, ఆ ఆదేశాలు అమలయ్యాయని గుర్తు చేసింది. అప్పుడు ఉన్న ఐజీ పోస్టు ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల అమలు చేయనప్పుడు పోలీసు శాఖను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అమలు విషయంలో పోలీసులు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల అమల్లో జాప్యం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నిందితులకు సహకరించినట్లు ఉందని తెలిపింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల నిందితులు ఇప్పటికే రికార్డులను తారుమారు చేసే ఉంటారని వ్యాఖ్యానించింది.
అయినా కూడా మీరు (పోలీసులు) చోద్యం చూస్తూనే ఉంటారంది. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం చాలా విషయాలను చెబుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసు శాఖ మొత్తం నిస్సారంగా, నిరుపయోగంగా మారిపోయిందని తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణి నుంచి రూ. 72,000 విలువైన 900 అమెరికన్ డాలర్లను దొంగిలించిన ఘటనకు సంబంధించి తిరుమల వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తాము కేవలం రికార్డుల సీజ్‌కు మాత్రమే ఆదేశాలిచ్చామని, దర్యాప్తునకు ఇవ్వలేదని గుర్తు చేసింది. అలాంటప్పుడు రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను సీఐడీలో ఏ అధికారి అయినా అమలు చేసి ఉండొచ్చునంది. ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే నిందించాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ మొత్తం వ్యవహారంలో తాము పోలీసుల తీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నామంది. గతంలో తాము ఆదేశించిన విధంగా రికార్డులను సీజ్ చేయాలని, అలాగే ఈ విషయంలో టీటీడీ బోర్డు తీర్మానాలకు సంబంధించిన రికార్డులను కూడా జప్తు చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ని ఆదేశించింది. వీటన్నిటినీ సీల్డ్ కవర్‌లో ఉంచి హైకోర్టు రిజి్రస్టార్ (జ్యుడిషియల్) ద్వారా తమ ముందు ఉంచాలని డీజీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.