అలా అని ఏ చట్టం చెబుతోంది?

Andhra Pradesh High Court on digital payments in liquor shops - Sakshi

మద్యం షాపుల్లో డిజిటల్‌ చెల్లింపులపై హైకోర్టు

పూర్తి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్‌కు ఆదేశం

సాక్షి, అమరావతి : మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులు తప్పనిసరని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయో తమ ముందుంచాలని హైకోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్, ఆన్‌లైన్‌ చెల్లింపులను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా, చీరాలకు చెందిన దాసరి ఇమ్మాన్యుయెల్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగ ప్రవీణ్‌ వాదనలు వినిపిస్తూ, డిజిటల్‌ చెల్లింపుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం చట్ట నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, మద్యం తాగడానికి వచ్చే పేదలకు డిజిటల్‌ చెల్లింపులు అడ్డంకిగా మారుతాయని, ఇది వారి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యం ద్వారా మద్యం తాగే పేదల వెంట ఎందుకు పడ్డారని ధర్మాసనం సరదాగా పిటిషనర్‌ను ప్రశ్నించింది. డిజిటల్‌ చెల్లింపుల విషయంలో చట్ట నిబంధనలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top