ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత
వాటిని నిర్దిష్ట కాల వ్యవధిలోపే నెరవేర్చి తీరాలి
అర్థం లేని కారణాలను సాకుగా చూపడం సరికాదు
తెలుగు గంగ భూ నిర్వాసితుల వ్యాజ్యంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ
సాక్షి, అమరావతి: హామీలిచ్చి నెరవేర్చబోమంటే కుదరదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని తెలుగు గంగ భూ నిర్వాసితుల వ్యాజ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. హామీలను నెరవేర్చడానికి ఒక విధానాన్ని రూపొందించినప్పుడు దానికి అనుగుణంగా నిర్దిష్ట కాల వ్యవధిలోపే ఆ హామీలను నెరవేర్చి తీరాలని పేర్కొంది. సాంకేతిక అంశాలతోసహా అర్థం లేని కారణాలను సాకుగా చూపడం సరికాదని చెప్పింది. మనదేశంలో ప్రజలకు భూమితో వీడదీయలేని సంబంధం ఉంటుందని, భూమిని మనం అమ్మలా ప్రేమించడమే దీనికి కారణమని తెలిపింది.
భూమి తీసుకున్నప్పుడు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, లేదంటే ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని పేర్కొంది. అంతిమంగా ఇది సమాజంలో అశాంతికి దారి తీస్తుందని హెచ్చరించింది. ఈ వ్యాజ్యం విషయంలో నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తెలుగు గంగ ప్రాజెక్టు కోసం 40 ఏళ్ల క్రితం భూములు కోల్పోయిన భూ నిర్వాసిత కుటుంబాలకు ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చింది.
కేసు నేపథ్యం ఇదీ...
తెలుగు గంగ ప్రాజెక్టు కోసం 1984 నుంచి చేస్తున్న భూ సేకరణలో భాగంగా అధికారులు కడప జిల్లాలో పెద్ద మొత్తంలో భూములు సేకరించారు. భూ నిర్వాసితులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి పునరావాసం కలి్పంచే నిమిత్తం ప్రభుత్వం 1986లో జీవో నెంబర్ 98ని జారీ చేసింది. పునరావాసం నిమిత్తం అర్హులైన వారు ఏడాదిలోపు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలంటూ ఆ జీవోలో పేర్కొన్నారు. అటు తరువాత 1987లో ప్రభుత్వం ఈ షరతును తొలగించింది. భారీ, మధ్య తరహా సాగునీరు, విద్యుత్ ప్రాజెక్టుల్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్‌లకు సమానమైన పోస్టుల్లో 50 శాతం పోస్టులను భూ నిర్వాసితులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడ్డ వారితో భర్తీ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో అర్హతలు ఉన్న పలువురు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే హామీ ఇచ్చిన మేర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోవడంతో కొందరు ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం వారికి ఉద్యోగాలిచ్చింది. ఇదే రీతిలో అర్హులైన మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. దశాబ్దాల క్రితం తమ భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని, అర్హులైన తమకు కూడా ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన రాజోల జగన్నాధరెడ్డి, మరో 46 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించింది. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసింది.


