
అప్పుల్లో ఏపీ టాప్.. 2025–26 తొలి నాలుగు నెలలపై ‘కాగ్’ గణాంకాలివీ
బాబు సర్కారు బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.48,354.02 కోట్లు
మూల ధన వ్యయం రూ.8,579.86 కోట్లు మాత్రమే
తిరోగమనంలో అమ్మకం పన్ను.. క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తికి ఇదే నిదర్శనం
2023–24తో పోల్చితే రెవెన్యూ రాబడులు రూ.9,400.99 కోట్లు లాస్
కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా గ్రాంట్లల్లో ఏకంగా రూ.15,581.20 కోట్లు తగ్గుదల
గత ప్రభుత్వ హయాంతో పోల్చితే సామాజిక రంగ వ్యయం రూ.8,863.90 కోట్లు తక్కువ
బాబు పాలనలో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పెరగడమే కానీ తగ్గుదల మాటే లేదు
సాక్షి, అమరావతి: అప్పుల్లో అగ్రపథం.. సంపద శూన్యం!! టీడీపీ కూటమి సర్కారు పాలనలో సంపద సృష్టి దేవుడెరుగు అప్పులు మాత్రం భారీ వృద్ధితో రంకెలు వేస్తున్నాయి! రాష్ట్ర సంపద పెరగకపోగా గత ప్రభుత్వ హయాంలో వచ్చింది కూడా రాకుండా పోతోంది. అమ్మకం పన్ను రాబడి అడుగంటుతోంది. అంటే ప్రజల కొనుగోలు శక్తి అంతకంతకూ క్షీణిస్తోందని స్పష్టమవుతోంది. ఈ మేరకు 2025– 26 ఆర్థిక ఏడాదికి సంబంధించి తొలి నాలుగు నెలలు (ఏప్రిల్ నుంచి జూలై వరకు) బడ్జెట్ కీలక సూచికలు, గణాంకాలను ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజాగా వెల్లడించింది.
అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. కాగ్ గణాంకాల ప్రకారం కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలను మించి ఆంధ్రప్రదేశ్ భారీగా అప్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.48,354.02 కోట్ల మేర అప్పులు చేసినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి.
» సాధారణంగా రెవెన్యూ రాబడులు ఏటా ఎంతో కొంత పెరుగుతాయి. కానీ టీడీపీ కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి రెవెన్యూ రాబడులు తగ్గుతూ వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు వచ్చిన రెవెన్యూ రాబడులతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు వచ్చిన రెవెన్యూ రాబడులు 16.08 శాతం క్షీణించి రూ.9,400.99 కోట్లు తగ్గిపోయాయి.

» ఇప్పుడు సంపద పెరగకపోగా గతంలో వచ్చింది కూడా ఆవిరైపోతోంది. ఇందుకు ప్రధాన కారణం సంపద సృష్టిపై దృష్టి సారించకుండా రెడ్ బుక్ అమలు లక్ష్యంగా రాజకీయ కక్షలతో పాలన సాగించడమే. 2023–24 ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలలతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో అమ్మకం పన్ను రాబడులు 7.23 శాతం క్షీణించి రూ.457.93 కోట్లు తగ్గిపోయాయి.
» టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర గ్రాంట్ల రూపంలో రావాల్సిన రాబడులు గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన గ్రాంట్లతో పోలిస్తే 2025–26 తొలి నాలుగు నెలల్లో కేంద్ర గ్రాంట్లు ఏకంగా రూ.15,581.20 కోట్లు తగ్గిపోయాయి. అంటే ఏకంగా రూ.87.63 శాతం మేర కేంద్ర గ్రాంట్లు క్షీణించాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా గ్రాంట్ల రూపంలో నిధులను రాబట్టడంలో కూడా చంద్రబాబు సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
» వైఎస్ జగన్ ప్రభుత్వంతో పోల్చితే చంద్రబాబు పాలనలో సామాజిక రంగ వ్యయం కూడా తగ్గిపోయింది. సామాజిక రంగ వ్యయం సాధారణంగా పెరగాలి. అందుకు భిన్నంగా 2023–24 ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలలతో పోల్చితే 2025–26లో సామాజిక రంగ వ్యయం రూ.8,863.90 కోట్లు తగ్గిపోయింది. అంటే ఏకంగా 15.04 శాతం వ్యయం తగ్గింది. సామాజిక రంగంలో వ్యయం అంటే విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై చేసే వ్యయంగా పరిగణిస్తారు.
» సాధారణంగా ఏటా బడ్జెట్ వ్యయం పెరుగుతుంది. అయితే అందుకు భిన్నంగా అప్పులు పెరుగుతూ రాష్ట్ర సంపద తగ్గుతూ రావడం అంటే తిరోగమనంలోకి వెళ్తున్నట్లు స్పష్టం అవుతోంది. 2023–24 ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలలతో పోల్చితే ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల బడ్జెట్ వ్యయం రూ.9,629.89 కోట్లు తగ్గింది. అంటే ఏకంగా 9.26 శాతం మేర బడ్జెట్ వ్యయం తగ్గింది.
నాలుగు నెలల్లో రూ.48,354.02 కోట్ల అప్పు
ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కారు బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.48,354.02 కోట్లు చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మూలధన వ్యయం కేవలం రూ.8,579.86 కోట్లు మాత్రమే చేసినట్లు కాగ్ పేర్కొంది. అదే వైఎస్సార్ సీపీ హయాంలో 2023–24 ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో మూల ధన వ్యయం రూ.14,844.99 కోట్లుగా ఉండటం గమనార్హం. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయాలని ఎన్నికల ముందు గంభీరంగా చెప్పిన చంద్రబాబు ఎడాపెడా అప్పులు చేస్తూ అటు ఆస్తుల కల్పనకు వెచ్చించకపోగా ఇటు సూపర్‌సిక్స్ హామీలనూ నెరవేర్చడం లేదు.
మరో పక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరగడమే కానీ తగ్గడం లేదు. రెవెన్యూ రాబడులు పెరగకపోగా అప్పులు పెరగడం ఆందోళన కలిగించే విషయమని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 2023–24 ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో వచ్చిన రాబడులు కూడా ఇప్పుడు రాకపోగా ఇంకా తగ్గిపోవడం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందని విశ్లేషిస్తున్నాయి.