ఒకవైపు ఎండ.. మరోవైపు వాన | Andhra Pradesh has different climatic conditions | Sakshi
Sakshi News home page

ఒకవైపు ఎండ.. మరోవైపు వాన

Aug 11 2021 2:55 AM | Updated on Aug 11 2021 2:55 AM

Andhra Pradesh has different climatic conditions - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురవగా, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడంతో మంగళవారం  దక్షిణ భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా విశాఖ రికార్డుకెక్కింది.

మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు... ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అల్పపీడనం దిశను మార్చుకుని ఒడిశా వైపు పయనించే సూచనలు కూడా కనిపిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు జోరందుకొంటాయని అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కిర్లంపూడిలో 75.25 మి.మీ, రావులపాలెంలో 72.25 మి.మీ, అయినవిల్లిలో 64.5, ఐ.పోలవరంలో 62.25, రాజమండ్రిలో 55.5, దగదర్తిలో 44.5, ఒంగోలులో 42.5 మి.మీల వర్షపాతం నమోదైంది.    

Advertisement
 
Advertisement
Advertisement