బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి 

Andhra Pradesh Government Special focus on child care - Sakshi

సిద్ధమైన బాలల సంక్షేమ కమిటీలు, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డులు 

బాలల సంక్షేమం, సంరక్షణే లక్ష్యం 

అన్యాయానికి గురైతే చట్టపరంగా అండదండలు 

సాక్షి, అమరావతి: అభాగ్యులైన చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ఇటీవలే బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు (జేజేబీ)లు ఏర్పాటయ్యాయి. బాలల సంక్షేమం, సంరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన వీటిలో అన్ని జిల్లాల నుంచి 85 మంది సభ్యులుగా నియమితులయ్యారు. వీరందరికీ విజయవాడలోని హరిత బెరంపార్కులో నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ్యులు నిర్వర్తించాల్సిన విధులు, వారి పరిధిని వివరించడంతోపాటు పోక్సో, జువెనైల్‌ యాక్ట్, బాల్య వివాహాల నిర్మూలన, బాలల సంరక్షణ వంటి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు.  

కమిటీలు, బోర్డుల ఏర్పాటు ఇలా.. 
జువెనైల్‌ జస్టిస్‌–2015 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఈ నియామకాలను పూర్తి చేసింది. ప్రతి జిల్లాకు ఒక బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), ఒక జువెనైల్‌ జస్టిస్‌ బోర్డును ఏర్పాటు చేసింది. సీడబ్ల్యూసీలో చైర్‌పర్సన్, నలుగురు సభ్యులు, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డులో ఒక ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్, ఇద్దరు సంఘ సేవకులు సభ్యులుగా ఉంటారు. వీరంతా మూడేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. 18 ఏళ్లలోపు బాలల హక్కులు, సమస్యలు, సంక్షేమం, సంస్కరణ కోసం సీడబ్ల్యూసీ, జేజేబీలు పని చేస్తాయి. 

అభాగ్యులకు అండగా.. 
వీధి, అనాథ బాలలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి వారిని సంరక్షణ కేంద్రాలకు అప్పగించడం.. వారికి విద్య, వైద్యం, వసతి కల్పించడం వంటి చర్యలను సీడబ్ల్యూసీ, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు పర్యవేక్షిస్తుంటాయి. వివిధ కారణాలతో ఇంటికి దూరమైన బాలలను గుర్తించి.. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రుల చెంతకు చేరుస్తాయి. అక్రమ రవాణాకు గురైన బాలలకు ప్రభుత్వపరంగా సాయమందించేలా కృషి చేస్తాయి. నిర్బంధపు బాల కార్మికులు, వేధింపులకు గురైన వారికి చట్టపరంగా అండగా నిలుస్తాయి. బాల నేరస్తుల్లో పరివర్తన తెచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాయి. అన్యాయానికి గురైతే అండదండలు అందించడం వంటి చర్యలు చేపడతాయి. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తరఫున ఆదుకునే విధంగా తమ వంతు పాత్ర పోషిస్తాయి. ఇలా అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి చిన్నారికి సీడబ్ల్యూసీ, జేజేబీ భరోసా ఇవ్వనున్నాయి.  

బాలల సంక్షేమం, సంస్కరణకు ప్రాధాన్యం 
బాలల సంక్షేమంతోపాటు వారి సంస్కరణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ సీడబ్ల్యూసీ, జేజేబీలను ఏర్పాటు చేశాం. ఆ కమిటీలు, బోర్డు సభ్యులు ఎలా పని చేయాలి, ఏం చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నాం.   
 –కృతికా శుక్లా, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top