డెంగీపై ప్రభుత్వం అప్రమత్తం 

Andhra Pradesh Government alert on dengue fiver - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా కేసులపై అధికారుల రోజువారీ సమీక్ష 

మరిన్ని ఆస్పత్రుల్లో ఎలీశా టెస్టులు 

డెంగీ కేసుల నియంత్రణ బాధ్యత జిల్లా మలేరియా ఆఫీసర్లదే 

సాక్షి, అమరావతి:  డెంగీ జ్వరాల సీజన్‌ కావడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో డెంగీ కేసుల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు పడుతుండటం తో కొన్ని పట్టణ ప్రాంతాల్లో డెంగీ కేసులు పెరిగాయి. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు. డెంగీ నిర్ధారణ చేసే ఎలీశా కిట్‌లు ప్రతి ఆస్పత్రిలోనూ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా డెంగీ నిర్ధారణ చేసే ఆస్పత్రుల సంఖ్య పెంచారు. గతంలో జిల్లా, బోధనాసుపత్రుల్లో మాత్రమే ఉండేవి. నిర్ధారించిన సెంటినల్‌ సర్వైలెన్స్‌ ఆస్పత్రులకు గ్రామీణ ప్రాంత వాసులు వెళ్లాల్సి వచ్చేది. 14 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాస్పత్రులతో పాటు తాజాగా 48 ఏరియా ఆస్పత్రులనూ సెంటినల్‌ సర్వైలెన్స్‌ ఆస్పత్రుల జాబితాలో చేర్చారు. దీంతో ప్రతి ప్రాంతంలోనూ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. కనీసం నెల రోజులకు అవసరమైన కిట్‌లు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. 

ఆస్పత్రి ఆవరణలో బ్యానర్లు 
డెంగీ నిర్ధారణకు గుర్తించిన ఆస్పత్రుల్లో ఆస్ప త్రి ముందు బ్యానర్లు కట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో డెంగీ లక్షణాలున్న వారిని గుర్తించి వారికి ఎలీశా టెస్టులు నిర్వహిస్తారు. సెంటినల్‌ సర్వైలెన్స్‌ ఆస్పత్రులకు ఆయా జిల్లా మలేరియా అధికారులే బాధ్యత వహించాలి. సేకరించిన నమూనాల వివరాలు రోజూ కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర కార్యాలయానికి పంపాలి. డెంగీ అను మానిత కేసులు ఎక్కడ ఉన్నా వారికి పరీక్షలు నిర్వహించి, ఆయా ప్రాంతాల్లో మందులు పిచికారీ చేయాలి. జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు, పీడియాట్రిక్స్‌ వైద్యులు, మైక్రోబయాలజిస్ట్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, నోడల్‌ అధికారుల మొబైల్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలు ఇవ్వాలి. వీళ్లందరూ అందుబాటులో ఉండాలని కుటుంబ సంక్షేమశాఖ ఆదేశించింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top