
సాక్షి, అమరావతి: ఈ నెల 14వ తేదీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని అందులో పేర్కొన్నారు. తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
ఆ తర్వాత జరిగే బీఏసీ (బిజినెన్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే అంశాలను నిర్ణయించనున్నారు. శాసనసభలో రెండోరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. శాసనమండలిలో రెండోరోజు సభ్యులు చల్లా భగీరథరెడ్డి, బచ్చుల అర్జునుడు మృతికి సంతాప తీర్మానం అనంతరం సమావేశం వాయిదా పడనుంది.
మూడోరోజు నుంచి రెగ్యులర్‌గా మండలి సమావేశాలు జరుగుతాయి. 14 నుంచి 24వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మధ్యలో వారాంతపు సెలవులు, ఉగాది పోగా 7–8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అధికారికంగా ఈ అంశాలన్నింటినీ బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని ఆ సమావేశంలోనే ఖరారు చేయనున్నారు.