Sakshi News home page

రబీలోనూ ప్రత్యామ్నాయ పంటలు

Published Mon, Dec 25 2023 4:08 AM

Alternative crops in Rabi: andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రబీ సీజన్‌లోనూ నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. సీజన్‌లో నెలకొన్న బెట్ట పరిస్థితులకనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుచేసేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది.

సీజన్‌ ఆరంభమై నెలన్నర రోజులైన నేపథ్యంలో.. రబీసాగు లక్ష్యం 55.96 లక్షల ఎకరాలుగా కాగా, ఇందుకు 3,64,372 క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ ఇండెంట్‌ పెట్టింది. దీంతో 3,78,200 టన్నులను ఆర్బీకేల్లో పొజిషన్‌ చేయగా, ఇప్పటివరకు 2,49,647 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ప్రధానంగా 2.45 లక్షల క్వింటాళ్ల శనగ, 3,500 క్వింటాళ్ల వేరుశనగ, 500 క్వింటాళ్ల చొప్పున వరి, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. గతేడాది ఇదే సమయానికి 10.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 8.5 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.  

ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ఇప్పటికే ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీజన్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను ప్రతీ 15 రోజులకోసారి సమీక్షిస్తూ తదనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే, అచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫార్సులకనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించారు.  

గోదావరి ప్రాజెక్టు కింద సాగునీరు
గోదావరిలో పుష్కలంగా నీరుండడంతో ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ, ఆక్వా అవసరాలకు తగినంత నీరివ్వనున్నారు. ఐఏబీ–డీఏఏబీ సమావేశంలో ఏ మేరకు సాగునీరు ఉందో అంచనావేస్తూ ఎంత విస్తీర్ణంలో సాగుకు నీరు ఇవ్వగలమో రైతులకు ముందుగానే చెబుతున్నారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు కాలువల కింద నీటి సరఫరాను నిలిపివేసే తేదీలపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పింస్తున్నారు.

ఇక శివారు ప్రాంతాల్లో (టెయిల్‌ ఎండ్‌ ఏరియాస్‌) సాధ్యమైనంత త్వరగా నాట్లు వేసుకునేలా అవగాహన కల్పింంచడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులు విధిగా పాటించేలా రైతులను అప్రమత్తం చేయనున్నారు. గోదావరి డెల్టా పరిధిలో వెదజల్లు సాగును ప్రోత్సహించడంతో పాటు అత్యధిక నీటి వినియోగమయ్యే పంటల్లో ఒకటైన మొక్కజొన్న సాగును కాలువల కింద ప్రోత్సహించకూడదని నిర్ణయించారు. 

వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు 
బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఐఏబీ, డీఏఏబీ సమావేశాలను సంయుక్తంగా నిర్వహించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మెట్ట ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా అపరాల సాగును, కాలువల ఎగువ ప్రాంతాల్లో అపరాలతో పాటు మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకనుగుణంగా 14 జిల్లాల పరిధిలో కనీసం 60వేల ఎకరాల్లో కంటిజెంట్‌ ప్లానింగ్‌ అమలుచేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం 6,229 క్వింటాళ్ల విత్తనం అవసరమని గుర్తించారు. వీటిని సబ్సిడీపై రైతులకు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.  

ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం
స్వల్పకాలంలో చేతికొచ్చే పంటల సాగును ప్రోత్సహించేలా రూపొందించిన ఈ కార్యాచరణను ఆర్బీకేల ద్వారా కరపత్రాలు, వాల్‌ పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు. అంతేకాక.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికనుగుణంగా సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులకు సంబంధించి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కూడిన చిన్నపాటి వీడియో, ఆడియో సందేశాలతో రైతులకు అవగాహన కల్పింస్తున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement