జూలైలోనే అన్ని ప్రవేశ పరీక్షలు

All entrance exams in July itself in Andhra Pradesh - Sakshi

షెడ్యూళ్లు ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి

జూలై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్‌

అదే నెల 13న ఎడ్‌సెట్, లాసెట్‌ 

18 నుంచి 21 వరకు పీజీఈసెట్, 22న ఈసెట్, 25న ఐసెట్‌

సెప్టెంబర్‌ నుంచే తరగతుల నిర్వహణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షలను జూలైలో పూర్తి చేసేలా ఉన్నత విద్యామండలి షెడ్యూళ్లను ఖరారు చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా, లా, బీఈడీ, పీజీ తదితర అన్ని ఉన్నత విద్యాకోర్సులకు జూలైలోనే ప్రవేశ పరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు ఆయా పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ మంగళవారం ప్రకటించారు. మరోవైపు సెప్టెంబర్‌ నుంచి తరగతుల నిర్వహణకు వీలుగా ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. గత రెండేళ్లుగా కరోనాతో విద్యాసంవత్సరం అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో 2022–23 విద్యాసంవత్సరానికి పకడ్బందీ కార్యాచరణతో మండలి ముందుకు వెళ్తోంది. వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలను సకాలంలో పూర్తి చేయించి తరగతులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని భావిస్తోంది.

ప్రవేశ పరీక్షలకు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు
ఉన్నత విద్యామండలి నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు ఏటా 3 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ ఒక్కదాన్నే 2 లక్షల మంది వరకు రాస్తున్నారు. 2020–21లో ఈఏపీసెట్‌ రెండు విభాగాల (ఇంజనీరింగ్‌/అగ్రి)కు 2,73,588 మంది దరఖాస్తు చేయగా 2,32,811 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,02,693 మంది క్వాలిఫై అయ్యారు. 2021–22లో 2,60,406 మంది దరఖాస్తు చేయగా 2,44,526 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,06,693 మంది అర్హత సాధించారు. ఈసారి అంతకన్నా ఎక్కువ మంది హాజరయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top